సీత క్షమించింది..!
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రజా సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా జరుగుతున్న మేలు గురించి ఓ మహిళ వివరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు, సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటివద్దే అందుతున్న సౌకర్యాల గురించి ప్రస్తావిస్తూ పాలనలో వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. అయితే.. విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కొండెంపూడికి చెందిన జనసేన సానుభూతిపరులైన ఇద్దరు యువకులు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు.
రావికమతం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దంట్ల నాగసీత వారిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో కేసును వాపసు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమెను ప్రాధేయపడ్డారు. ఆ యువకులు ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు మరోసారి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయబోమని పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. (డాక్టర్ సుధాకర్ పోలీసుల అదుపులో లేరు)