బీజేపీలో చేరిన రవీంద్ర ఆంగ్రే
సాక్షి, ముంబై: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపున్న మాజీ పోలీసు అధికారి రవీంద్ర ఆంగ్రే బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రావ్‌సాహెబ్ దాణ్వే సమక్షంలో సోమవారం ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రవీంద్ర ఆంగ్రే తన హాయంలో మొత్తం 54 ఎన్కౌంటర్లు చేశారు. అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఠాణేలోని మహేష్ వాగ్ అనే బిల్డర్‌ను బెదిరించి, అతని ఆస్తులను ఆక్రమించేందుకు ప్రయత్నించాడని, అతని హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. మహేష్ వాగ్ ఫిర్యాదుపై 2008లో రవీంద్ర ఆంగ్రేను పోలీసులు అరెస్టు చేసి ఆయనపై సస్పెన్షన్ విధించారు. సుమారు 14 నెలలపాటు జైలులో గడిపిన అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఆంగ్రే తనపై కాల్పులు జరిపాడంటూ మహేష్ వాగ్ మరోసారి ఆరోపించడంతో మళ్లీ 2010లో అరెస్టు చేశారు. అయితే ఎట్టకేలకు ఈ ఆరోపణల నుంచి ఆయనకు విముక్తి లభించింది. పోలీసు ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేసి తిరిగి విధుల్లో చేర్చుకుంది. కానీ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరినందున రాజకీయాలలో తన రెండో ఇన్నింగ్‌ను ప్రారంభించారని చెప్పవచ్చు.