జోరు తగ్గని సమైక్య పోరు
తిరుపతి, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్య పోరు ఉధృతమవుతోంది. 93 రోజులైనా ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు పట్టువదలని విక్రమార్కుల్లా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించారు. గురువారం తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు స్థానిక సత్యనారాయణపురానికి చెందిన కార్యకర్తలు హాజర య్యారు. ఎమ్మెల్యే కరుణాక రరెడ్డి వారికి సంఘీభావం ప్రకటించి, కొంత సేపు దీక్షలో కూర్చున్నారు.
పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సమైక్యవాదులు ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రవీంద్రభారతి స్కూల్ విద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. వీఆర్వో మురళి రాఘవేంద్రస్వామి అవతారంలో నిరసన తెలిపారు. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
చిత్తూరులో ఎన్జీవోలు మధ్నాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మదనపల్లెలో జ్ఞానోదయ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ, మిట్స్‌తో కలసి మల్లికార్జున సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. పుత్తూరులో వెంకటేశ్వర ఐటీఐ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు.