'కాందహార్ హైజాకర్ల ముందు దద్దమ్మలైపోయాం'
న్యూఢిల్లీ: 'జైష్- ఏ- మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్ సహా మరో ఇద్దరు అగ్రనాయకులను విడిపించుకునేందుకు ఉగ్రవాదులు పన్నిన కాందహార్ విమానం హైజాక్ వ్యూహాన్ని చిత్తుచేసే అవకాశం ఉండికూడా మనవాళ్లు చేష్టలుడిగిపోయారు. సంక్షోభ నివారణ కోసం ఏర్పాటయిన ఉన్నతస్థాయి బృందం ఒకరినొకరు దూషించుకోవడం మినహా సమస్యను పరిష్కరించేందుకు కించిత్ ప్రయత్నమూ చేయలేదు. దీంతో హైజాకర్లముందు మనం దద్దమ్మలైపోయాం' అంటూ 1999లో జరిగిన కాందహార్ విమానం హైజాక్ ను గురించి మాటల బాంబులు పేల్చారు నాటి రా (రీసెంర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్ ఏఎస్ దౌలత్.
ఆయన రచించిన 'కశ్మీర్: ది వాజపేయి ఇంయర్స్' పుస్తకావిష్కరణ గురువారం రాత్రి ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన దౌలత్ పలు ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. 'ఖాట్మండూ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం హైజాక్ అయినట్లు తెలిసింది. ఇంధనం కోసం విమానం కొద్దిసేపు అమృత్సర్ విమానాశ్రయంలో ఆగింది. నిజానికి అప్పటికే పంజాబ్ పోలీస్ చీఫ్ సరబ్జిత్ సింగ్.. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం నిష్ణాతులైన కమాండోలను కూడా సిద్ధం చేసిఉంచారు. 'ఓకే' అనడమే తరువాయి ఆపరేషన్ మొదలయ్యేది. కానీ ఢిల్లీలో కూర్చొని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోన్న ఉన్నతాధికారుల బృందం మాత్రం అందుకు 'నో' చెప్పింది. దీంతో ఉగ్రవాదులు విమానాన్ని లాహోర్‌కు అక్కడి నుంచి కాందహార్‌కు తీసుకెళ్లి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు' అని దౌలత్ చెప్పారు. అయితే బాధ్యులైన అధికారుల పేర్లు వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.