సంతకం పెట్టకుంటే దూకేస్తా
అనంతపురం : పొలం విక్రయానికి భార్య సంతకం పెట్టలేదని భర్తకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వాటర్ ట్యాంక్ ఎక్కాడు. సంతకం పెట్టకపోతే అక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ ఘటన మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
రాయదుర్గం పట్టణంలోని ఉల్లిగమ్మ దేవాలయం వద్ద దంపతులు ఎర్రస్వామి, కృష్ణవేణి నివసిస్తున్నారు. అయితే మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకున్నారు. అయితే వీరికి ముగ్గురు పిల్లలున్నారు. నాలుగు ఎకరాల పొలం కూడా ఉంది. చెరో రెండెకరాల పొలం పంచుకున్నారు. కాగా పొలం అంతా భార్య పేరు మీద ఉంది.
విడాకుల వ్యవహారం పూర్తయిన తర్వాతే సంతకం పెడతానని భార్య అనడంతో ఎర్రస్వామి ట్యాంకెక్కి కిందకు దూకుతానని బెదిరిస్తున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.