రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
విధులు బహిష్కరించి న్యాయవాదులు
కదిరి (అనంతపురం) : రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కదిరిలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి బార్ రూం ముందు నిరసన తెలియజేశారు. వెనుకబడిన ప్రాంతం రాయలసీమను అభివృద్ది చేసే విషయంలో హైకోర్టు సీమ జిల్లాల్లో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని బార్ అసోషియేషన్ అద్యక్షులు నాగేంద్రరెడ్డి సూచించారు. అభివృద్ది ఒకే చోట చేసి తప్పు చేశామని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. అదే తప్పు మళ్లీ చేస్తే ఈ ప్రాంత ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు.
గతంలో రాజధాని కర్నూలును తాము త్యాగం చేశామని, ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక నూతన రాజధాని కోస్తాలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భూసేకరణ చేపడుతోందని, కనీసం హైకోర్టు విషయంలోనైనా సీమ జిల్లాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. హైకోర్టు సాధనలో సీమ జిల్లాల్లోని న్యాయవాదులందరూ ఒకచోట సమావేశమవుతామన్నారు. దీనిపై ఉద్యమాలకు సిద్దమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల రాష్ట్ర నాయకులు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, టీడీపీ లీగల్ సెల్ నాయకులు వాసుదేవరెడ్డి, న్యాయవాదులు గురులింగ స్వామి, రవూఫ్, ప్రభాకర్‌రెడ్డి, ఫైజుల్లా, పట్నం చంద్రశేఖర్, ఛత్రేనాయక్ తదితరులు పాల్గొన్నారు.