ఎమ్మెల్యే గొల్లపల్లి తీరుపై రాపాక ఆగ్రహం
మలికిపురం : రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు తీరుపై అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాపాక వర పసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురంలో గురువారం ఆయన విలేకరులతోమాట్లాడుతూ ఇటీవల తన స్వగ్రామం చింతలమోరిలో రూ.38 కోట్లతో మంజూరైన ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని వేరే గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శంకరగుప్తం సర్పంచ్ ఉల్లూరు గోపాలరావు సూచనల మేరకు పూర్తి ఉప్పనీరు కల శంకరగుప్తంలో ఈ పథకం ఏర్పాటుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
చింతలమోరి ఎత్తిపోతల పథకాన్ని తన హయాంలో ప్రతిపాదించి నిధుల కోసం కృషి చేస్తే, గొల్లపల్లి ఇలా చేయడం దారుణమన్నారు. గొల్లపల్లి చర్యలపై కలెక్టరు అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తానని, నియోజకవర్గంలో ఆయన అక్రమాలపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఇసుక రీచ్ నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా సాగించి దండుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గానికి స్థానికేతరులైన గొల్లపల్లి పాలనపై అవగాహన లేక ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, నాయకులు రాపా క యోహన్, రాపాక వాల్మీకి పాల్గొన్నారు.
రాపాక ఆరోపణల్లో వాస్తవం లేదు : ఎమ్మెల్యే గొల్లపల్లి
రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు చెప్పారు. రాపాక ఆరోపణల సంగతి తెలిసిన వెంటనే ఆయన రావులపాలెం నుంచి మలికిపురం విలేకరులతో ఫోన్ చేసి మాట్లాడారు. రాపాక హయాంలోనే ప్రతిపాదించిన చింతలమోరి లిప్ట్ ఇరిగేషన్ పథకం మూలన పడి ఉంటే తాను నీటిపారుదల శాఖ మంత్రి చుట్టూ తిరిగి మంజూరు చేయించానని, చింతలమోరిలోనే ఆ పథకం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. రాపాక ఎటువంటి అపోహలు పడనవసరం లేదని పేర్కొన్నారు.