రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం
ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ సుబ్బరాయశర్మ
గంగలకుర్రు (అంబాజీపేట) : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రూ.250 కోట్లతో రహదారులను నిర్మించనున్నట్టు ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ పి.సుబ్బరాయశర్మ అన్నారు. కోనసీమలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల స్థితి గతులను, వాటి పరిస్థితిని తెలుసుకునేందుకు శనివారం వచ్చిన ఆయన అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో జయంతి భాస్కర సుబ్రహ్మణ్యం స్వగృహంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రూ.250 కోట్లతో నిర్మించే రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి మంజూరు నిమిత్తం పంపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 5400 కిలో మీటర్ల రహదారిని, జిల్లాలో 628 కిలో మీటర్ల రహదారిని పంచాయతీ రాజ్ నుంచి ఆర్అండ్బీకి బదలాయించారన్నారు. అత్యవసర, ప్రాముఖ్యమున్న రహదారుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ పనులన్నింటినీ దశలవారీగా చేపడతామన్నారు. అంబాజీపేట మండలంలో మాచవరం, గంగలకుర్రు, పుల్లేటికుర్రు, కె.పెదపూడి, ఇరుసుమండ, మొసలపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ రూ.8 కోట్లతో రహదారిని నిర్మించనున్నామన్నారు. ఇందులో భాగంగా కె.పెదపూడి కౌశికపై రూ.3 కోట్లతో వంతెన నిర్మిస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. జిల్లాలో గ్రామీణ రహదారుల స్థితిగతులు పరిశీలించనున్నామన్నారు. అయినవిల్లి నుంచి ముమ్మిడివరం వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ ఆరు కిలోమీటర్లు నిర్మించామని, మిగిలిన 4 కిలోమీటర్లకు ప్రభుత్వం నుంచి మంజూరు రావాల్సి ఉందన్నారు. ఉప్పలగుప్తం నుంచి అనాతవరం, అమలాపురం నుండి రావులపాలెం, రాజోలు నుంచి ఈతకోట వరకూ రహదారులు వెడల్పు చేసి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్అండ్బీ స్థలాల్లో ఆక్రమణల తొలగింపునకు స్థానికులు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. కాకినాడ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి, అమలాపురం ఈఈ రామచంద్రరావు, డీఈ వైవీ రావు, కొత్తపేట డీఈ వై.రాధాకృష్ణ ఆయన వెంట ఉన్నారు.