ఫ్లాప్‌లో పడితే ఫ్లాపే...
సంగీతం
ఆర్.డి.బర్మన్ చివరి రోజులు కొంచెం బాధాకరంగా గడిచాయి. 1980 వరకూ తిరుగులేకుండా ఉన్న ఇతడు బప్పి లాహిరి రాకతో కొంచెం షేక్ అయ్యాడు. మరోవైపు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ గట్టిగా నిలబడటం వల్ల కూడా ఇతడి పరిస్థితి కష్టమైంది. బర్మన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాక ఏ నిర్మాతలైతే అతడి సంగీతం కోసం పడిగాపులు కాచారో వాళ్ల ఆఫీసుల ముందు ఆర్.డి.బర్మన్ పడిగాపులు కాస్తూ కనిపించడం ప్రారంభించాడు. బర్మన్కు నిర్మాత నాసిర్ హుసేన్ ముందు నుంచి గట్టి మద్దతు ఇచ్చేవాడు. ఆయన ప్రతిసినిమా యాదోంకి బారాత్, హమ్ కిసీసే కమ్ నహీ... వంటి హిట్స్ అన్నీ బర్మన్ చేసినవే. అయితే జమానేకో దిఖానాహై, మంజిల్ మంజిల్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాక నాసిర్ హుసేన్ దర్శకత్వం నుంచి తప్పుకుని తన కుమారుడు మన్సూర్ ఖాన్‌కు పగ్గాలు ఇచ్చాడు.
దాంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా మ్యూజిక్ బర్మన్కు రాకుండా తప్పిపోయింది. మన్సూర్ ఖాన్ ఆ సినిమా కోసం ఆనంద్-మిళింద్ను తీసుకున్నాడు. ఇది బర్మన్ను చాలా బాధించింది. అలాగే ఆర్.డి. బర్మన్ ద్వారా ‘కర్మ’ వంటి మ్యూజికల్ హిట్ పొందిన సుభాష్ ఘాయ్ తన రాబోయే చిత్రం ‘రామ్ లఖన్’ను బర్మన్‌కే ఇస్తానని మాట ఇచ్చి చివరి నిమిషంలో లక్ష్మీకాంత్ - ప్యారేలాల్కు ఇచ్చాడు. అప్పటికే బర్మన్ గుండె బలహీనపడింది. ఈ సంఘటనలను అది తట్టుకోలేకపోయింది. విధువినోద్ చోప్రా కరుణించి‘1942 ఏ లవ్‌స్టోరీ’ (1995) సినిమా సంగీతం అవకాశం ఇస్తే బర్మన్ దానికి అందించిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమా రిలీజ్‌కు ముందే 1994లో అతడు మరణించాడు. కాని బర్మన్ మరణించాక అతడి ఖ్యాతి ఇంకా పెరిగింది. అతడు చేసిన పాటలు పదే పదే సినిమాల్లో రీమిక్స్ అయి కనిపించాయి. కనిపిస్తూ ఉన్నాయి. కేవలం బర్మన్ పాటలను ఉపయోగించి ‘దిల్ విల్ ప్యార్ వ్యార్’ అనే సినిమాను తీశారు. ఇలాంటి మర్యాద దక్కిన అరుదైన ఘనత బర్మన్‌కే సొంతం.