వీఆర్ఓలకు మెమోలు జారీచేయాలి: ఆర్డీఓ
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో వివిధ గ్రామాలలో పనిచేస్తున్న వీఆర్ఓల పనితీరు సరిగా లేదని వారందరికీ వెంటనే మెమోలు జారీ చేయాలని ఆర్డీఓ హుసేన్ సాహెబ్, తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మను గురువారం ఆదేశించారు. ఆర్డీఓ, తాహశీల్దార్ సంయుక్తంగా కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీఓ హుసేన్ మాట్లాడుతూ.. గ్రామాలలో వీఆర్ఓల పనితీరు ఏమాత్రం సక్రమంగా లేదన్నారు. కేవలం జీతాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. బుక్కరాయసముద్రం మండలంలో ఇప్పటి వరకు 48 వేల రెవెన్యూ పరమైన ఫిర్యాదులు అందాయన్నారు. వీటిలో వీఆర్ఓలు 4 వేలు మాత్రమే పరిష్కరించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో అలాంటి అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.