(గో)దారీ తెన్నూ లేదు
నక్కపల్లి : దారులన్నీ గోదారి వైపు మళ్లాయి. ఉత్తరాంద్ర భక్తులు పోటెత్తారు. వరుసగాసెలవుదినాలు కావడంతో భారీగా వాహనాల్లో జనం రాజమండ్రికి పుష్కరాలకు క్యూకట్టారు. దీంతో శనివారం జాతీయరహాదారి జనసంద్రమైంది. ఎక్కడి కక్కడ ట్రాఫిక్ జాంఅయింది. నక్కపల్లినుంచి 5 కిలోమీటర్ల దూరం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేటు వద్ద వాహనాలన్నీ చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. రెవెన్యూ,పోలీస్ యంత్రాంగాలు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాయి. వేంపాడు టోల్గేట్ వద్ద అరగంటకు 10నుంచి 20 బస్సులు నిలిపి ట్రాఫిక్ కంట్రోలు చేస్తున్నారు.
నక్కపల్లి, అడ్డురోడ్డు, తుని ప్రాంతాల్లో ప్రతి పదికిలోమీటర్లకూ నిలిపివేసి వదులుతున్నారు. నర్సీపట్నం ఆర్డివో కే సూర్యారావు పరిస్థితి సమీక్షిస్తున్నారు. టోల్గేట్ వద్ద ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి రోజుకు 50వేల వాటర్ప్యాకెట్లు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. మహిళలకోసం తాత్కాలికంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. టోల్గేట్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో కొద్దిసేపు ఫీజు వసూలు చేయకుండా వాహనాలను వదిలేశారు. తునినుంచి అనకాపల్లివరకు జాతీయరహదారికి ఇరువైపులా ఉన్న హోటళ్లు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీని ఆసరాగా చేసుకుని చిరువ్యాపారులు ఇష్టానుసారం భక్తులనుంచి దోపిడీకి పాల్పడుతున్నారు.
శనివారం అనకాపల్లి-తుని మద్య జాతీయరహదారిపై ట్రాఫిక్ జాం కావడంతో వేంపాడు టోల్గేట్ వద్ద పోలీసులు బస్సులను కొద్దిసేపు నిలిపివేసారు. దీంతో ప్రయాణికులు చాల ఇబ్బందులు పడ్డారు. తాగునీరు, తినుబండారాల కోసంరోడ్డుపక్కన ఉన్న చిరుదుకాణాలను ఆశ్రయించారు. . వాటర్‌ప్యాకెట్ రూ.3లు వాటర్ బాటిల్ రూ. 25లనుంచి 30లకు విక్రయించారు. కొబ్బరి బొండాలయితే ఒక్కొక్కటి రూ.25నుంచి 30లకు అమ్మారు. బిస్కట్‌ప్యాకెట్లను సాదారణ ధరకంటే రెట్టింపురేట్లకు విక్రయించారు.
టీలను సయితం రూ.5నుంచి 10లకు విక్రయించారు. టోల్గేట్ వద్ద పనస పండ్లు, పైనాపిల్, కొబ్బరిబొండాల విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పనసతొనలను 6 చొప్పున ప్యాకెట్లలోపెట్టి రూ.10లకు విక్రయించారు. పైనాపిల్ ఒక్కొక్కటి రూ.50నుంచి 80లకు విక్రయించారు. అరటి పళ్లయితే డజను రూ.50నుంచి 60లకు విక్రయించారు. గత్యంతరం లేక ప్రయాణీకులు, యాత్రీకులు రోడ్డుకు ఇరువైపునా ఉన్న దుకాణాలపై ఎగబడిమరీ కొనుగోలుచేసారు.