తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
నార్నూర్(ఆసిఫాబాద్): ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఉట్నూర్ ఆర్డీవో విద్యాసాగర్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. 2014, 2016– 17 ఓటరు జాబితాలో ఉన్న తేడాను గమనించి సవరించాలని తహసీల్దార్ ముంజం సోమును ఆదేశించారు. మండలంలోని సుంగాపూర్ తండా, గోండుగూడ, కోలాంగూడ గూడేలకు ఒకే చేతిపంపు ఉండడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ గ్రామంలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సుంగాపూర్ సమీపంలో చెరువు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంసీ సోహాన్సింగ్, ఆర్ఐ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.