'ఆ రాక్షసికి తల్లయినందుకు బాధగా ఉంది'
'నాకో రాక్షసి పుట్టింది... జిహాదీతో ఆమె పెళ్లి ఆపేందుకు చైన్లతో కట్టేసి కూడ ప్రయత్నించాను. కానీ ఆపలేకపోయాను. చివరికి ఆమె అనుకున్నట్టుగానే సిరియా చేరిపోయింది' అంటూ ఐసిస్ పోస్టర్ గర్ల్ తల్లి తీవ్ర ఆవేదన చెందుతోంది. ఇరవై ఏళ్ళ ఫాతిమా ధర్ఫరోవా సిరియా ప్రయాణాన్ని ఆపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఫాతిమా సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్ కు మద్దతుగా పోస్టులు చేసేదని తల్లి శాఖ్లా బోఖరోవా వెల్లడించింది.
పారిస్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను, రష్యన్ పర్యాటక విమానం కూల్చిన వారిని ఫాతిమా కీర్తించడం రష్యన్లకు ఆగ్రహం తెప్పించిందని, అతివాద ఇస్లామిక్ నియామకుడి ఆకర్షణలో పడి, నాలుగో భార్యగా మారిన కూతురి పై ఆ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ తల్లీ ఇటువంటి రాక్షసులకు జన్మనివ్వాలని అనుకోదని, నిజంగా ఇటువంటి భూతానికి తల్లినైనందుకు చింతిస్తున్నానని బొఖరోవా అంది. ఒక ఉగ్రవాదికి తల్లిగా జీవించడం కంటే మరణించడం మేలని ఆవేదన వ్యక్తం చేసింది.
2014 లో సిరియాకు చేరిన 17 ఏళ్ళ సామ్రా కేసినోవిక్, ఆమె స్నేహితురాలు సబీనా సెలిమోవిక్ ఐఎస్ఐఎస్ పోస్టర్ గర్ల్స్ గా మారారు. ఆ తర్వాత జిహాదీల చేతిలో తీవ్రంగా హింసకు గురై హతమయ్యారు. ఇప్పుడు తన కూతురికీ అదే దుస్థితి దాపురిస్తుందని ఆ తల్లి తీవ్రంగా రోదిస్తోంది. ఫాతిమా చిన్నతనం నుంచి తనతో ఎంతో సన్నిహితంగా, ప్రేమగా ఉండేదని చెప్పింది. అయితే సైబీరియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాతే ఆమెలో ఎంతో మార్పు వచ్చిందని, సిరియా పారిపోయిన తన పెద్ద కూతుర్ని తిరిగి చూడగలనా అంటూ శాఖ్లా బోఖరోవా ఆవేదన చెందుతోంది.
'అక్కడ ఫాతిమా నిజంగానే ఓ రిక్రూటర్ గా ఉంటే... తూటాలకు బలవ్వక తప్పదు. ఉగ్రవాదులు ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టరు. ఆమె జీవితం ఇలా మారిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు. యూనివర్శిటీకి వెళ్ళిన తర్వాతే ఫాతిమాలో పూర్తిగా మార్పు చోటు చేసుకుంది. కనీసం కుటుంబంతో కలసి పండుగ చేసుకోవడానికి కూడ నిరాకరించేది. ఆమెలో రోజురోజుకూ వచ్చిన మార్పు చివరికి జిహాదీల వద్దకు చేర్చింది' అంటూ ఫాతిమా తల్లి రోదించింది.
'ఓసారి అబ్దుల్లా మా కుమార్తెను పెళ్ఙ చేసుకుంటానని పర్మిషన్ అడిగాడు. అప్పటికే ముగ్గురు భార్యలున్నారని, ఒక్కొక్కరికీ ముగ్గురు చొప్పున పిల్లలు కూడ ఉన్నారని చెప్పాడు. దాంతో నేను అస్సలు ఒప్పుకోలేదు. ఫాతిమా తనను ప్రేమిస్తోందని, తాను కూడ ఫాతిమాను ఇష్టపడ్డానని అబ్దుల్లా చెప్పాడు. నా కూతురితో మాట్లాడి ఆమె పెళ్లి నిర్ణయాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నించాను. ఆమె ఉగ్రవాది కాకుండా కాపాడేందుకు ప్రయత్నించినా నా మాట వినలేదు. ఇక నా కూతుర్ని ఈ జన్మలో చూడలేను' అంటూ ఫాతిమా తల్లి కన్నీరుమున్నీరయ్యింది.