రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌తోపాటు సమీపంలో ఉన్న విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, మధ్య కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. తద్వారా హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. భద్రాచలం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో శుక్రవారం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని, మార్కెట్‌కు తరలివచ్చిన ధాన్యం తడిసిపోకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాత్రివేళల్లో మార్కెట్ యార్డుల్లో విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాటరీ లైట్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో 2 శాఖల సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు.