80 లక్షల కుటుంబాలకు ‘మన టీవీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలకు ‘మన టీవీ’ ప్రసారాలను చేర్చడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సాఫ్ట్‌నెట్ సీఈఓ శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మన టీవీ ద్వారా గ్రూప్-2 అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రస్తుతం రిసీవర్ టెర్మినల్స్ (ఆర్‌ఓటీ) ద్వారా మన టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయన్నారు. వీటిని కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా.. అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఇందులో పాల్గొంటారని వెల్లడించారు. ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ప్రస్తుతమున్న నాలుగు చాన ళ్లకు అదనంగా.. మరో నాలుగు చానళ్ల ద్వారా కార్యక్రమాలను ప్రసారం చేసే వీలుంటుందన్నారు. ప్రస్తుతం విద్యార్థులు, యువతకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మన టీవీ.. త్వరలో మహిళా, శిశు సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాలకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన, ప్రసారాలపై దృష్టి సారిస్తుందన్నారు.