స్మగ్లింగ్ రూటే సపరేట్
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఎర్రచందనం మాఫియాకు జిల్లా అడ్డాగా మారుతోంది. ఇతర దేశాల్లో ఎర్రచందనానికి మంచి గిరాకీ ఉండటం, అనతి కాలంలో కోట్లు గడించే అవకాశం ఉండటంతో అనేక మంది స్మగ్లర్లు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. జిల్లాలోని రాపూరు, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50 వేల హెక్టారుల్లో ఎర్రచందనం ఉన్నట్లు అధికారులు అంచనా. ఒక్కో దుంగ లక్షల్లో పలుకుతోంది. జిల్లాలో అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెంచడంతో స్మగ్లర్లు సరికొత్తగా పంధాను మార్చారు.
ఇటీవల కాలంలో పట్టుబడిన ఎర్రచందనం ఇందుకు ఉదాహరణ. కొందరు స్మగ్లర్లు నిమ్మకాయల బస్తాలు, ఇసుక బస్తాలు, మామిడి కాయలు, పొట్టు, తవుడు మాటున ఇలా అనేక మార్గాల్లో జిల్లాను దాటి చెన్నైకు తరలిస్తున్నారు. స్మగ్లర్ల ఎత్తుగడలను అటవీశాఖాధికారులు పసిగట్టి ఛేదిస్తుండటంతో సరికొత్త పంధాను మార్చారు.తాజాగా లారీ అడుగు భాగంలో అరగా తయారు చేసి ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. ఇటీవల రాపూరు అటవీశాఖ అధికారులు స్మగ్లర్ల కొత్త ఎత్తుగడను కూడా ఛేదించారు. ప్రతి రోజు జిల్లాలో ఎక్కడో ఒకచోట ఎర్రచందనం పట్టుబడుతుందంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గత ఐదేళ్ల కాలంలో అటవీశాఖ అధికార లెక్కల ప్రకారం 1001.059 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2292.053 లక్షలు ఉంటుందని అంచనా. అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎంత నిఘా పెట్టినప్పటికి పూర్తి స్థాయిలో నివారించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
స్థానికుల సహకారంతోనే
ఎర్రచందనం అక్రమ రవాణాకు స్థానికులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకులతో స్మగ్లర్లు చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణా సాగిస్తున్నారన్న విషయం అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొండ కింద ఉన్న ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఎర్రచందనం తరలుతోంది.
గ్రామాల్లో చైతన్యం రావాలి :
ఎర్రచందనం అక్రమ రవాణాను శక్తి వంచన లేకుండా అడ్డుకుంటున్నాం. ప్రాణాలకు తెగించి స్మగ్లర్లను ఎదుర్కొంటున్నాం. స్మగ్మర్లు నాటు తుపాకులు, ఇనుపరాడ్లు, కత్తుల వంటి ఆయుధాలును ఉపయోగిస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమ రవాణాను ఎంచుకోవడంతో ఇబ్బందిగా మారింది. వారిని ఎదుర్కొనే క్రమంలో అటవీ సిబ్బంది గాయాలు పాలైన సందర్భాలు ఉన్నాయి.
- అల్లాభక్షు, రాపూరు రేంజ్ అధికారి