అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో అంతర్జాతీయ స్మగ్లర్ ఏటీ మైదీన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మైదీన్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా. చాయ్‌వాలాగా జీవితం ప్రారంభించిన మైదీన్ స్మగ్లింగ్ దిగి భారీగా ఆస్తులు కూడబెట్టాడు. అతని వద్ద నుంచి 66 ఎర్రచందనం దుంగలతో పాటు 2 బీఎండబ్ల్యు కార్లు, మరో 2 నిస్సాన్ కార్లు, ఒక టాటా క్సినాన్ పికప్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.
అతని వద్ద రూ. 55 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు, 4 సెల్ఫోన్లు, పలు డాక్యుమెంట్లు గుర్తించారు. సుమారు రూ.78 కోట్ల స్థిర చర ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ విలేకరులకు తెలిపారు. అతనితో పాటు మరో ఇద్దరు అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.