రాష్ట్రంలో భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం
రాష్టంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిన్న సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ సమీపంలోని కేజీ పెంటలో 39 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నామని, అందుకు సంబంధించిన 39 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
స్మగ్లర్లు నుంచి రెండు వ్యాన్లతోపాటు రెండు ద్వి చక్రవాహనాలను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. స్మగ్లర్ల నుంచి రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే ముద్దుంపాడు, కొలిమిట్ట ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 49 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకుసంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే రాజంపేటలో 30 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకున్నారు. నందలూరు, మైదకూరు ప్రాంతాలో కూడా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను పట్టుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.