శ్రీగంధం.. ఎర్రచందనం..
మొక్కల పెంపకానికి జిల్లావాసుల ఆసక్తి
►‘మన ఊరు.. మన ప్రణాళిక’లో విజ్ఞప్తులు
►జిల్లా భూభాగం అనువు కాదంటున్న అటవీ అధికారులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : శేషాచలం అడవుల్లో పెరిగే శ్రీ గంధం, ఎర్రచందనం మొక్కల పెంపకానికి జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. ‘మన ఊరు.. మన ప్రణాళిక.’లో భాగంగా గ్రామాలకు వెళ్లిన అటవీ అధికారులకు ఈ అరుదైన రకాల మొక్కలను సరఫరా చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. నాణ్యమైన టేకు కలపకు జిల్లా దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. కానీ, ఇప్పుడు జిల్లా వాసులు మాత్రం ఈ అరుదైన రకాల మొక్కలు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ మొక్కలు సరఫరా చేయాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వ చ్చాయని సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో జానకిరామయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. జిల్లా భూముల్లో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెరిగే అవకాశాలున్నప్పటికీ.. నాణ్యత అంతగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై మీడియాలో తరచూ కథనాలు వస్తుండటం కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘హరితహారానికి’ 72 లక్షల మొక్కలు
తెలంగాణలో 25 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో కొత్తగా కొలువుదీరిన కేసీఆర్ సర్కారు ముందుకెళుతోంది. ఇందుకోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏటా ఒక్కో నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ సీజనులో నాటేం దుకు జిల్లాలో 72 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్క న ఒక్కో గ్రామ పంచాయతీకి 8వేల మొక్కలు సరఫరా చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో అటవీశాఖకు సంబంధించి సామాజిక వన విభాగం (సోషల్ ఫారెస్టు)తో, టెరిటోరియల్ విభాగం నర్సరీలను పెంచుతోంది. డ్వామా, సింగరేణి, అట వీ అభివృద్ధి సంస్థ(టీఎఫ్‌డీసీ) వంటి ప్రభుత్వ రంగ సంస్థల నర్సరీ లు కూడా జిల్లాలో ఉన్నాయి. కాగజ్‌నగర్‌లో ఉన్న ప్రైవేటు సంస్థ ఎస్పీఎం కూడా నర్సరీలను పెంచుతోంది. నిమ్మ, జామ, దానిమ్మ, టేకు, సుబాబుల్, నీలగిరి వంటి మొక్కలు ఈ ఏడాది అందుబాటులో ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ప్రారంభంలో జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మొక్కలు నాటుతారు. ఈ సీజనులో జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 72 లక్షల మొక్కలు నాటేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
2.35 కోట్ల మొక్కల పెంపకానికి ప్రణాళిక
రానున్న సంవత్సరానికి 2.35 కోట్ల మొక్కలు పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అటవీశాఖ సామాజిక వన విభాగం డీఎఫ్‌వో జానకిరామయ్య తెలిపారు. ‘మన ఊరు.. మన ప్రణాళిక ..’లో భాగంగా జిల్లా లో మొక్కల పెంపకానికి అనువైన స్థలాలను గుర్తిస్తున్నామని అన్నా రు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, బొడగుట్టలు, కాలువల పక్కన స్థలాలు, పడీత్ భూములు వంటి వాటిని గుర్తించామని అన్నారు. ఇంటి ఆవరణలు, పొలంగట్లలో ఏ మేరకు స్థలం అందుబాటులో ఉందో గుర్తిస్తున్నామని తెలిపారు.