Registrar maintenance
-
రిజిస్ట్రార్ ముందే కేసుల మెన్షనింగ్
సాక్షి, న్యూఢిల్లీ: అత్యవసర కేసుల మెన్షనింగ్ ఇకపై రిజిస్ట్రార్ వద్దే చేసుకోవచ్చని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. బెంచ్‌ల వద్ద మెన్షనింగ్ స్థానంలో ఈ కొత్త పద్ధతి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.‘సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, జూనియర్లు అవకాశాలు కోల్పోవాలని మేం కోరుకోం. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థ రూపొందించాం. బెంచ్‌ల ముందు ప్రస్తావించే అంశాలన్నీ ఇక ముందు రిజిస్ట్రార్ వద్దే ప్రస్తావించొచ్చు’ అని జస్టిస్ రమణ తెలిపారు. బెంచ్‌ల ముందు మెన్షనింగ్ పద్ధతి స్థానంలో సంబంధిత అధికారి ముందు మెన్షన్ చేసుకొనే పద్ధతి తీసుకొస్తున్నట్లు సీజేఐ జస్టిస్ రమణ తెలిపారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కామన్‌కాజ్ స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన కేసు విచారణ సందర్భంగా బుధవారం సీజేఐ మాట్లాడారు. -
చికిత్స.. పక్కా లెక్క
సాక్షి, అమరావతి: రోగి ఆస్పత్రికి వెళితే చిత్తు కాగితం మీద కూడా మందులు రాసిన సందర్భాలు అనేకం. కేస్ షీట్లు రాసేందుకు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో పేపర్లు ఉండేవి కావు. ఇదంతా గతం. ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నిర్వహణ జరుగుతోంది. ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్) ప్రమాణాల మేరకు ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్ట్రీ నిర్వహిస్తారు. ప్రతి పేషెంట్‌కు సంబంధించిన వివరాలు నిబంధనల మేరకు రిజిస్ట్రీ (నమోదు) అవుతాయి. గతంలోలా కాకుండా ఓపీ, ఐపీ స్లిప్పులూ మారనున్నాయి. ఇన్ పేషెంట్‌కు సంబంధించి ఏకంగా 16 పేజీల పుస్తకం నిర్వహిస్తారు. ఎవరు ఎలాంటి వైద్యం చేశారు.. ఏం మందులు రాశారు.. ఏయే రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు వంటి వివరాలన్నీ ఈ కేస్ షీట్లో ఉంటాయి. ఒక్కసారి ఇన్ పేషెంట్‌గా చేరిన వ్యక్తి సమాచారం మొత్తం ఈ పుస్తకంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ నాణ్యతా ప్రమాణాలు.. ► ప్రస్తుతం రాష్ట్రంలో పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్) మదింపు జరుగుతోంది. ఈ ప్రమాణాలను అందుకోవాలంటే ఆస్పత్రుల్లో ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగానే ఓపీ, ఐపీ స్లిప్పులు, రిజిస్ట్రీలో భారీగా మార్పులు తెచ్చారు. ► దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్‌క్యూఏఎస్ మదింపు పరిధిలోకి ఇన్ని ఆస్పత్రులను తీసుకురాలేదు. ఏపీలో మాత్రమే ఈ విధానంతో ముందుకెళుతున్నారు. ఎన్‌క్యూఏఎస్ ప్రమాణాల మదింపు సుమారు 90 రకాల సేవలకు సంబంధించి చేస్తారు. ఇందులో ఓపీ..ఐపీ ప్రధానమైనవి. ఒక పేజీ ఓపీ షీట్, 16 పేజీల కేస్ షీట్ ► తాజాగా ఇన్ పేషెంట్ షీట్‌ను మార్చారు. ఇందులో జబ్బు వివరాలు, పేషెంట్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు ఇవన్నీ చేసి అందులో రాయాలి. ► కేస్ షీట్.. 16 పేజీలతో ముద్రించిన పుస్తకం డాక్టర్ల దగ్గర ఉంటుంది. మొదటి పేజీలో పేషెంట్ వివరాలు, అంగీకార పత్రం మొదలుకుని అన్ని వివరాలు ఉంటాయి. ► ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్.. అంటే రోగ నిర్ధారణ పరీక్షలు చేశాక ఫలితాలు విధిగా రాయాల్సి ఉంటుంది. 3వ పేజీలో రోగి హిస్టరీ అంటే పేషెంట్‌కు దీర్ఘకాలిక జబ్బులున్నాయా.. ఎలాంటి మందులు వాడుతున్నారు, కుటుంబ హిస్టరీ వంటివన్నీ రాస్తారు. ► మెడికల్ చార్ట్ పేరుతో 5వ పేజీ రూపొందించారు. ఇందులో మందు పేరుతో పాటు డోసు, ఎన్ని వాడాలి, ఏ టైములో వాడాలి అనేది రాసి ఉంటుంది. ► నర్సు ఏ షిఫ్టులో ఎన్నిసార్లు పరీక్షించిందో, సేవలు అందించిందో అనే దానికి ఒక పేజీ కేటాయించారు. రోగికి కౌన్సిలింగ్ చేయడం, ఆహారం గురించి చెప్పడం విధిగా రాయాలి. ► డిశ్చార్జి సమ్మరీతో పాటు రోగి చనిపోతే డెత్ సమ్మరీ కాపీ ఒకటి ఆస్పత్రి వద్ద ఉంచుకుని, మరొకటి పేషెంట్ కుటుంబ సభ్యులకు విధిగా ఇవ్వాలి. ఇందులో విధిగా కారణాలను రాయాల్సి ఉంటుంది. రోగికి సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్ డేటాలో నిక్షిప్తం చేస్తారు. -
అద్దె గోడు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పక్కా భవనాలు లేకపోవడం తో పంచాయతీ సిబ్బంది రిజిస్ట్రార్ మెయింటెనెన్స్, కీ బుక్, చెక్ పవర్ వంటి పనులు ఇంటివద్దనే చేస్తున్నారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఇందులో 529 జీపీలకు పక్కా భవనాలు ఉండగా.. 337 జీపీలకు పక్కా భవనాలు లేవు. కాగా, 2010లో ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద 256 జీపీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. మిగతా 81 జీపీల భవన నిర్మాణాలు మంజూరు లభించకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మూడేళ్లు గడుస్తున్నా మంజూరైన భవన నిర్మాణాలు కొన్ని పూర్తి కాలేదు. మరికొన్ని పునాది స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని పూర్తికాగా ఇప్పటివరకు ప్రారంభించలేదు. నిర్మాణాలకు సంబంధించిన పూర్తిబాధ్యత పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులదే. ఇదిలా ఉండగా, జిల్లాలో 529 జీపీలకు భవనాలు ఉన్నాయి. ఇందులో 122 జీపీ భవనాలకు మరమ్మతు చేయాల్సి ఉంది. 12 జీపీల మరమ్మతుకు మాత్రమే 2013-14గాను ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇంకా 110 జీపీల మరమ్మతుకు నిధులు విడుదల చేయాలి. మరమ్మతుకు రూ.36 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే రాాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తి కరణ్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌కేఏ) పథకం కింద జిల్లాలోని 12 గ్రామ పంచాయతీ భవనాల మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో గ్రామ పంచాయతీ భవనం మరమ్మతుకు రూ.3 లక్షల చొప్పున 12 జీపీలకు రూ.36 లక్షలు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 25 నిధులు భరిస్తుంది. అయితే మిగతా జీపీలకు కూడా విడతలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 110 జీపీ భవనాల మరమ్మతుకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని ఆయా సర్పంచ్‌లు ఎదురుచూస్తున్నారు. కొత్త భవనాలకు రూ.2.77 కోట్లు జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుగా ఉండగా, ప్రస్తుతం 81 గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్తగా 23 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్‌జీపీఎస్‌కేఏ పథకం కింద నిధులు మంజూరు చేసింది. 22 జీపీలకు ఒక్కొక్క జీపీకి రూ.12 లక్షల చొప్పున మంజూరు కాగా, బోథ్ గ్రామ పంచాయతీ భవనానికి జనాభా ప్రతిపాదికన రూ. 13.5 లక్షలు మంజూరయ్యాయి. మొత్తం 23 కొత్త భవన నిర్మాణాలకు రూ.2.77 కోట్లు మంజూరయ్యాయి. కాగా, బేల, ఇచ్చోడలోని తలమద్రి, ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్, జైనూర్లోని దబోలి, నార్నూర్‌లోని గాదిగూడ, సిర్పూర్(యు), ఉట్నూర్‌లోని బీర్సాయిపేట, హస్నాపూర్, ఆసిఫాబాద్‌లోని బురుగుగూడ, భీమిని, కన్నెపల్లి, దహేగాం, కెరమెరిలోని కరంజివాడ, తిర్యాణిలోని మంగి, వాంకిడిలోని బంబార, భైంసాలోని మహాగాం, దండేపల్లిలోని మామిడిపల్లి, కడెంలోని మున్యాల్, ఖానాపూర్లోని పెంబి, లోకేశ్వరం, సారంగపూర్‌లోని కౌట్ల(బి), తానూర్, బోథ్ గ్రామ పంచాయతీల నూతన భవనాలు మంజూరయ్యాయి.