అద్దె గోడు | no building to village panchayat | Sakshi
Sakshi News home page

అద్దె గోడు

Published Mon, Feb 17 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

no  building to village panchayat

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లాలో గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పక్కా భవనాలు లేకపోవడం తో పంచాయతీ సిబ్బంది రిజిస్ట్రార్ మెయింటెనెన్స్, కీ బుక్, చెక్ పవర్ వంటి పనులు ఇంటివద్దనే చేస్తున్నారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఇందులో 529 జీపీలకు పక్కా భవనాలు ఉండగా.. 337 జీపీలకు పక్కా భవనాలు లేవు. కాగా, 2010లో ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద 256 జీపీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. మిగతా 81 జీపీల భవన నిర్మాణాలు మంజూరు లభించకపోవడంతో
  అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మూడేళ్లు గడుస్తున్నా మంజూరైన భవన నిర్మాణాలు కొన్ని పూర్తి కాలేదు. మరికొన్ని పునాది స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని పూర్తికాగా ఇప్పటివరకు ప్రారంభించలేదు. నిర్మాణాలకు సంబంధించిన పూర్తిబాధ్యత పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులదే. ఇదిలా ఉండగా, జిల్లాలో 529 జీపీలకు భవనాలు ఉన్నాయి. ఇందులో 122 జీపీ భవనాలకు మరమ్మతు చేయాల్సి ఉంది. 12 జీపీల మరమ్మతుకు మాత్రమే 2013-14గాను ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇంకా 110 జీపీల మరమ్మతుకు నిధులు విడుదల చేయాలి.

 మరమ్మతుకు రూ.36 లక్షలు
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే రాాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తి కరణ్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌కేఏ) పథకం కింద జిల్లాలోని 12 గ్రామ పంచాయతీ భవనాల మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో గ్రామ పంచాయతీ భవనం మరమ్మతుకు రూ.3 లక్షల చొప్పున 12 జీపీలకు రూ.36 లక్షలు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 25 నిధులు భరిస్తుంది. అయితే మిగతా జీపీలకు కూడా విడతలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 110 జీపీ భవనాల మరమ్మతుకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని ఆయా సర్పంచ్‌లు ఎదురుచూస్తున్నారు.

 కొత్త భవనాలకు రూ.2.77 కోట్లు
 జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుగా ఉండగా, ప్రస్తుతం 81 గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్తగా 23 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్‌జీపీఎస్‌కేఏ పథకం కింద నిధులు మంజూరు చేసింది. 22 జీపీలకు ఒక్కొక్క జీపీకి రూ.12 లక్షల చొప్పున మంజూరు కాగా, బోథ్ గ్రామ పంచాయతీ భవనానికి జనాభా ప్రతిపాదికన రూ. 13.5 లక్షలు మంజూరయ్యాయి. మొత్తం 23 కొత్త భవన నిర్మాణాలకు రూ.2.77 కోట్లు మంజూరయ్యాయి.

కాగా, బేల, ఇచ్చోడలోని తలమద్రి, ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్, జైనూర్‌లోని దబోలి, నార్నూర్‌లోని గాదిగూడ, సిర్పూర్(యు), ఉట్నూర్‌లోని బీర్సాయిపేట, హస్నాపూర్, ఆసిఫాబాద్‌లోని బురుగుగూడ, భీమిని, కన్నెపల్లి, దహేగాం, కెరమెరిలోని కరంజివాడ, తిర్యాణిలోని మంగి, వాంకిడిలోని బంబార, భైంసాలోని మహాగాం, దండేపల్లిలోని మామిడిపల్లి, కడెంలోని మున్యాల్, ఖానాపూర్‌లోని పెంబి, లోకేశ్వరం, సారంగపూర్‌లోని కౌట్ల(బి), తానూర్, బోథ్ గ్రామ పంచాయతీల నూతన భవనాలు మంజూరయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement