![Permanent buildings for public facilities in villages in Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/14/RBK_YSR-HEALTH.jpg.webp?itok=KPiEvpXZ)
సాక్షి, అమరావతి: పల్లెటూళ్లలోని ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా.. సొంత ఊరిలోనే సేవలన్నీ అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన భవనాల నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. రూ. 40 లక్షలతో గ్రామ సచివాలయం, రైతులకు వ్యవసాయ సంబంధిత సహాయం, సలహాల కోసం రూ. 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, గ్రామంలోనే వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా రూ. 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే.
దాదాపు రూ. 12 వేల కోట్ల ఖర్చుతో 36,708 శాశ్వత భవన నిర్మాణాలను ఈ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టగా.. ఇప్పటి వరకూ 9,628 భవనాలు పూర్తయ్యాయి. మరో 4,757 భవన నిర్మాణ పనులు పైకప్పు కూడా అయిపోయి దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అన్ని భవనాల నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను ఏమాత్రం ఆలస్యం లేకుండా చెల్లిస్తోంది.
వేగంగా పనులు..
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండల కేంద్రంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామ సచివాలయం భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం రంగులు వేసే పనులు కొనసాగుతున్నాయి. మంత్రాలయం మండలం చిట్నహళ్లి గ్రామంలో హెల్త్ క్లినిక్ భవనం ప్రస్తుతం బేస్‌మెంట్, ఫిల్లర్ల నిర్మాణం పూర్తయి గోడల నిర్మాణం దశలో ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భవనాల నిర్మాణం పనులు వేగంగా సాగుతూ వివిధ దశల్లో ఉన్నాయి.
సత్వరం బిల్లులు చెల్లింపు..
ఇప్పటిదాకా పూర్తయిన, పురోగతిలో ఉన్న భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా చెల్లించిందని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లోనూ నిర్మాణ పనులను అనుసరించి ఒక్కో దశ పూర్తయిన వెంటనే ఆ దశకు సంబంధించి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం ముందస్తు కార్యచరణ సిద్ధం చేసినట్టు అధికారులు వెల్లడించారు. బిల్లులు పెండింగ్ లేకుండా చూడటంతో పాటు నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలు పూర్తికి వీలుగా గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ ప్రతి వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు.
సిమెంట్ ధరల వల్ల పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు సిమెంట్‌ను కూడా సరఫరా చేయిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి సైతం వారం వారం ఉన్నతాధికారులతోనూ, జిల్లాల కలెక్టర్లతోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పైనుంచి కింది స్థాయి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ వరకూ నిరంతరం శ్రమిస్తు.. పనుల్లో రాజీ పడకుండా నిర్మాణ పనులు కొనసాగేలా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment