ఇదేం ‘పనితీరు’!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 63 జీఓను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన జీఓలోని పలు అంశాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బాగా పని చేసిన ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నామంటూ జారీ చేసిన ‘పనితీరు పాయింట్లు’ గందరగోళంగా మారాయి.
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో పిల్లలు చదువుకుంటుంటే రెండు పాయింట్లు కేటాయిస్తామంటున్నారు. అసలు పిల్లలే లేని, పెళ్లికాని, పిల్లలు పెద్దవారై కాలేజీల్లో చదువుతున్న వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత లేదు. వందశాతం విద్యార్థుల నమోదైన పాఠశాలలకు మూడు పాయింట్లు కేటాయిస్తామని చెప్పారు. అదికూడా ప్రాథమిక స్థాయి అయితే ఎంఈఓ, ఉన్నత స్థాయి అయితే డీవైఈఓ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రామాణికం లేకపోవడంతో టీచర్లు గందరగోళం చెందుతున్నారు. ఇక్కడ అక్రమాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
అలాగే పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు 3 పాయింట్లు ఇచ్చారు. అంటే కొన్ని చిన్న స్కూళ్లలో 20-30 మంది విద్యార్థులుండి అందరూ ఉత్తీర్ణత పొంది ఉంటారు. అలాగే 100 మంది పిల్లలుండి 3-4 శాతం ఫెయిలైతే ఆ స్కూల్ వెనుకబడినట్లే. కేటగిరి-4 ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు స్థానికంగా కాపురం ఉన్నట్లైతే 2 పాయింట్లు కలుపుతారు. స్థానికంగా ఉన్నారనే విషయాన్ని ఎవరు ధ్రువీకరిస్తారు? దీన్నిబట్టి చూస్తుంటే ఇక్కడ అక్రమాలకు తెర తీసే అవకాశం పుష్కలంగా ఉంది. రెండేళ్లలోపు దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి రూ. 2-3 లక్షల దాకా ఖర్చు చేసి ఉంటే 2 పాయింట్లు కేటాయిస్తారు.
రూ. 1.90 లక్షల లోపు ఖర్చు చేసి ఉంటే ఒక పాయింట్ కేటాయిస్తారు. కేవలం రెండేళ్లు మాత్రమే అని చెప్పడంతో చాలామంది టీచర్లు తమ స్కూళ్ల అభివృద్ధికి కృషి చేసి కూడా పాయింట్లు పొందలేని పరిస్థితి. ఆ స్కూల్లో పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు. గతేడాదికంటే ఈఏడాది 10-20 శాతం విద్యార్థుల నమోదు పెరిగి ఉంటే 2 పాయింట్లు కేటాయిస్తామన్నారు. చాలా గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అస్కారమే లేదు. రెండేళ్లుగా 95 శాతం హాజరున్న ఉపాధ్యాయులకు 3 పాయింట్లు కేటాయించారు. దీన్నిబట్టి చూస్తుంటే ఉపాధ్యాయుల కనీస హక్కులు కాలరాసినట్లేనని వాపోతున్నారు. సీఎల్, మెటర్నటీ, ఇతర ప్రత్యేక సెలవులు తీసుకుని ఉంటే 95 శాతం హాజరు ఎలా వస్తుందంటున్నారు. ఇలా జీఓలో పొందుపరిచిన చాలా అంశాలు గందరగోళంగా మారాయని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.