‘దారి’ తప్పిన భద్రత
రహదారి భద్రత దారి తప్పుతోంది. ప్రజల ప్రాణ రక్షణ కోసం వాహన తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ఫలితంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పెనుకొండ వద్ద గ్రానైట్ లారీ రైలును ఢీకొన్న ఘటన నేపథ్యంలో ఓవర్‌లోడ్ వ్యవహారం బయటకొచ్చింది.
అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్నా రవాణా శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా మడకశిర-పెనుకొండ దారిలో నిత్యం గ్రానైట్ లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నాయి. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి ఆర్టీఏ కార్యాలయాల్లో తొమ్మిది మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు), ఆరుగురు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఏఎంవీఐ) పని చేస్తున్నారు.
ఎన్ఫోర్స్ మెంట్లో ఇద్దరు ఎంవీఐలు, పెనుకొండ చెక్‌పోస్ట్‌లో ఇద్దరు ఎంవీఐలు, ముగ్గురు ఏఎంవీఐలు ఉన్నారు. ప్రతి అధికారి రోడ్డు భద్రతకు సంబంధించి బాధ్యతలు చూడాలి. ఓవర్ లోడ్ ప్రయాణికులు, గూడ్స్ వాహనాలతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, టాక్స్ చెల్లించని వాహనాలు, రికార్డులు సరిగా లేని వాటిని గుర్తించి జరిమనా విధించాల్సి ఉంటుంది. ఎంవీఐలకు ప్రతి నెలా రూ.6.75 లక్షల వరకు, ఏఎంవీఐలకు రూ.7.5 లక్షల వరకు టార్గెట్ ఉంటుంది. పెనుకొండ చెక్‌పోస్ట్‌కు మాత్రమే నెలకు రూ.30 లక్షల వరకు టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారులు ఈ టార్గెట్లు పూర్తిచేయడంలో చూపిస్తున్న శ్రద్ధ వాహనాల కండీషన్‌పై పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలోని రహదారుల మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. వీటిలో చాలా వరకు ఏదో ఒక లోపంతో ఉన్నవే. కానీ అధికారులు మామూళ్ల మత్తులో పడి తనిఖీలను మమ అనిపిస్తున్నారు. రవాణాశాఖ ఇస్తున్న టార్గెట్లకు మించి అనధికారిక ఆదాయాన్ని అధికారులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి నుంచి పెద్దఎత్తున ఓవర్‌లోడ్‌తో వాహనాలు వెళ్తున్నా అక్కడి రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా సాగుతున్నా పట్టించుకోవడం లేదు.
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
ఓవర్ లోడ్‌కు సంబంధించి బుధవారం నుంచి ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. తరచూ వాహన తనిఖీలు చేస్తున్నాం. కేసులు కూడా నమోదు చేస్తున్నాం. రహదారి భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
- సుందర్‌వద్ది, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్