రెండులక్షల పౌండ్ల ఇంటిని రెండు పౌండ్లకే..
లండన్: ఎంతో కష్టపడి ఆమె తన సొంతింటికలను తీర్చుకుంది. టీచర్‌గా పనిచేస్తూ దాదాపు రెండు లక్షల పౌండ్లు పెట్టి ఇళ్లును కొనుగోలు చేసింది. అయితే, అనుకోకుండానే అనతికాలంలో ఆమె అంతడబ్బు పెట్టి కొన్న ఇల్లును అనూహ్యంగా అమ్ముకోవాల్సి వచ్చింది.. అది కూడా అతి తక్కువకే. అందుకు కారణం ఆమెకు ఆ ఇల్లంటే ప్రాణం.. పైగా ఆమె పరిస్థితులు మాత్రం అంతకంటే అధ్వానం. వివరాల్లోకి వెళితే.. భారత్ సంతతికి చెందిన రేఖా పటేల్ అనే మహిళ బ్రిటన్‌లోని గ్లాసప్ అనే ప్రాంతంలోగల సైమండ్లీ అనే గ్రామంలో 2010లో కొంత శిథిలంగా ఉండి విశాలమైన ప్రాంగణంతో ఉన్న ఇల్లును దాదాపు రెండు లక్షల పౌండ్లు పెట్టి కొనుగోలుచేసింది.
అయితే, ఆ సమయంలో ఇల్లును పునరుద్ధరించే పనుల్లో ఉండగా దానికి సంబంధించిన రాళ్లు కాస్త పక్కింటిపై పడటంతో ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ తర్వాత కోర్టు వరకు వెళ్లింది. ఇలా కోర్టుల చుట్టూ తిరగడంలాంటివాటికి మొత్తం లీగల్ ఫీజులకు దాదాపుగా 76,000 ఒకేసారి చెల్లించే పరిస్థితి ఏర్పడింది. దీంతో చివరకు తన ఇల్లును అమ్ముకోవాలని నిర్ణయించి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకుంది. పదేళ్లపాటు అదే ఇంట్లో ఉండేందుకు అనుమతి తీసుకొని నెలకు 50 పౌండ్లు అద్దె చెల్లిస్తానని చెప్పుకుంది. కేవలం రెండు పౌండ్లకే ఇల్లును అమ్ముకొని ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. త్వరలోనే ఆమె ఇండియాకు వచ్చి తన రాష్ట్రమైన గుజరాత్లో పేద విద్యార్థులకు చదువు చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపింది.