తీరని వేదన
ఎవరిని కదిపినా అంతులేని కన్నీటి కథలే... ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ.. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కొందరైతే... బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు మరికొందరు... తాను క్షేమంగా బయటపడ్డా కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ విలపిస్తున్న మహిళ ఒకరైతే... భార్య, పిల్లలను పోగొట్టుకుని ఇక ఎవరి కోసం బతకాలంటూ విలపిస్తూ మరొకరు... గల్లంతైన కుటుంబ సభ్యుల కోసం కన్నీటితో వెతుకులాడుతూ ఇంకొందరు... ఇలా చాలామందికి ఇబ్రహీంపట్నం ఫెర్రీ సమీపంలోని పవిత్రసంగమం వద్ద బోటు తిరగబడిన ఘటన తీరని వేదన మిగిల్చింది.
సాక్షి,అమరావతి బ్యూరో : నిత్యం హారతులతో, సందడి వాతావరణంతో కనువిందు చేసే పవిత్ర సంగమం ప్రాంతంలో రెండో రోజూ విషాద వాతావరణం కొనసాగింది. నీటి ప్రవాహపు గలగలలతో ఆహ్లాదం పంచే కృష్ణమ్మ ఒడి బోటు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో కన్నీరుపెట్టుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విహార యాత్రకు ఒంగోలు నుంచి వచ్చిన 60 మందిలో 32 మంది బోటులో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు సమర్పించే హారతిని తిలకించేందుకు బయలుదేరారు. ఆబోటులో నెల్లూరుకు చెందినవారు కూడా ఎక్కారు. మరి కొద్ది నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకుని కృష్ణమ్మ తల్లికి సమర్పించే హారతులను కనులారా తిలకించేందుకు సన్నద్ధమవుతున్న వారిని బోటు ప్రమాదం సునామీలా చుట్టేసింది. ఆ సమయంలో వారి చేసిన ఆర్తనాదాలు, ప్రాణాలు కాపాడుకొనేందుకు చేసిన ప్రయత్నాలు, బిడ్డ బతకాలనీ తల్లి, భర్త బతికితే చాలనుకున్న భార్య, భార్య బతికితే బిడ్డల ఆలనాపాలనా చూస్తుందనుకున్న భర్త, ఏమి జరుగుతుందో తెలియక నీట మునిగిన చిన్నారుల ఆర్తనాదాల ఘోష సోమవారం కూడా సంగమ ప్రాంతంలో మార్మోగింది. ఆదివారం 16 మంది మృతిచెందారు. గల్లంతైనవారిలో నలుగురి మృతదేహాలు సోమవారం లభించాయి. మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.
ఒక్కొక్కరిది.. ఒక్కో కథ
నీటమునిగిన బోటులోనే ఒంగోలు వాకర్స్‌క్లబ్ సభ్యులతోపాటు నెల్లూరుకు చెందిన ప్రభు తన తల్లి లలితమ్మ, భార్య హరిత, కుమార్తె ఆశ్వికను కృష్ణమ్మ హారతిని తిలకించేందుకు పంపించారు. అతను మాత్రం ఎక్కలేదు. బోటు వెళ్లిన కొద్దిసేపటికే అది నీట మునిగిందని తెలిసి ప్రభు విలవిల్లాడారు. తల్లి, భార్య, బిడ్డ బతికుండాలని దేవుళ్లకు మొక్కుకున్నారు. ఆ ముగ్గురూ ఆదివారం గల్లంతవగా తల్లి లలితమ్మ, భార్య హరిత మృతదేహాలు సోమవారం లభించాయి. బిడ్డ అశ్విక ఆచూకీ ఇంకా తెలియక ఆ తండ్రి గుండె బాధతో బరువెక్కింది. నెల్లూరుకు చెందిన ప్రభు తన కుటుంబంతో విజయవాడలో నివసిస్తున్నారు. కొడుకు, కోడలిని చూసి, మనవరాలితో ముద్దులాడాలని లలితమ్మ నెల్లూరు నుంచి విజయవాడ వచ్చారు. అయితే ఈ ప్రమాదం ప్రభు కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఆంధ్రా ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుల ఆరోగ్యంపై క్షణక్షణం ఆరా తీస్తూ కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సుబ్బాయమ్మ తన సోదరుడి సుధాకర్‌ను చూపించండంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంది. అయితే అప్పటికే అతను విగతజీవిగా మారాడని ఎలా చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. ఆస్పత్రిలో చికిత్స పొంతున్న విజయశ్రీ తన కుటుంబసభ్యుల ఆచూకీ తెలుసుకునేందుకు పడిన ఆరాటం అందరికీ కన్నీరు తెప్పించింది. కుటుంబంలో ఒకరు మరణించి, మరొకరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి పరిస్థితి ప్రతిఒక్కరినీ కలిచివేసింది.
ఈ వైఫల్యం ఎవరిది?
పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం నదీతీరాన్ని ప్రైవేటు పరం చేసింది. కొందరు రాష్ట్ర మంత్రుల అండతో వారి బంధువులు, అనుచరులు నదీతీరంలో పర్యాటకాన్ని గుప్పిట్లో పెట్టుకోని ఎలాంటి అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా బోట్లు తిప్పుతున్నారు. ఆదివారం బోల్తా పడిన బోటుకు కూడా అనుమతి లేదు. ఆ బోటు నిర్వాహకులు గతంలో ఇద్దరు లేక ముగ్గురిని తీసుకెళ్లే స్పీడ్ బోట్‌కు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు వేరే బోటులో పరిమతికి మించి పర్యాటకుల్ని ఎక్కించి వారి ప్రాణాలను బలిగొన్నారు. 21 మంది ప్రాణాలు పోయాకగానీ బోటుకు అనుమతి లేదన్న విషయం వెలుగులోకి రాలేదు. ఇప్పటి వరకు అనధికారికంగా బోటింగ్ చేస్తూ కోట్ల రుపాయలు దోచుకుతిన్నారు. మంత్రుల నుంచి అధికారుల వరకు ఆ పాపపు సొమ్ములో వాటాలు అందాయన్న ఆరోపణలు ఉన్నాయి.
దెబ్బతిన్న బోట్ల వినియోగం..
ప్రస్తుతం పున్నమి ఘాట్, దుర్గా ఘాట్, పవిత్ర సంగమం, కృష్ణవేణి మోటల్ వద్ద బోటింగ్ పాయింట్లు ఉన్నాయి. వాటి నుంచి చాంపియన్, అమరావతిబోటింగ్ క్లబ్(ఏబీసీ), రివర్ బోటింగ్ సంస్థలు తమ బోట్లను తిప్పుతున్నాయి. వాటి నిర్వాహకులు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఉండే వారు కావడంతో నిబంధనలను నదిలో తొక్కేశారు. ఇతర రాష్టాల్లోని తమ బ్రాంచీల్లో వాడి పక్కన పడేసిన బోట్లను, దెబ్బతిన్న వాటిని కొని, పైపై మరమ్మతులు చేయించి నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.