మంత్రి బంధువులా... మజాకా!
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో మంత్రి బంధువుల ఆగ్రహంతో ఒక సూపరింటెండెంట్ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జిల్లాకు చెందిన వారు కావడంతో ఆయన పేరు చెప్పి నిత్యం అనేకమంది అతిథి మర్యాదలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన వారు మంత్రి బంధువులు అవునో కాదో తెలుసుకోవడం ఆలయ అధికారులకు, సిబ్బందికి ప్రహసనంగా మారింది.
మంత్రివర్యుల సిఫార్సు లేఖ లేకుండా వచ్చి డిమాండ్ చేసి మరీ శ్రీవారి దర్శనం చేసుకునే వారి సంఖ్య చాలానే ఉంటోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి చినవెంకన్న దర్శనార్థం కొందరు మంత్రి బంధువులమని స్వామివారి దర్శనానికి వెళ్లాలని ఆలయ సూపరింటెండెంట్ రమణరాజును అడిగారు. అయితే వారు మంత్రి లెటర్ గాని, ప్రొటోకాల్ గానీ లేకుండా వచ్చారు. దీంతో రమణరాజు దర్శనానికి అనుమతించడం కుదరదని, దర్శనం టికెట్లు తప్పనిసరని వారికి సూచించారు. ఇంతలో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడమని సూపరింటెండెంట్‌కు ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఫోన్ తీసుకోమని, టికెట్లు తేవాలని రమణరాజు ఖచ్చితంగా చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు మంత్రి మాణిక్యాలరావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆలయ అధికారులు వెంటనే స్పందించి మంత్రి బంధువులమని వచ్చిన వారికి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయానికి వచ్చినవారి పట్ల దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో సూపరింటెండెంట్ రమణరాజును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.