కాల్ చేయగానే.. రూం వద్దకు వచ్చేస్తుంది
హోటల్ రూం సర్వీసుకు ఫోన్ చేసి.. కాఫీ తెమ్మంటే.. రోబోలే తెచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో అలాంటి రోబోలు చకచకా తిరిగేస్తూ.. తమ సేవలను అందించేస్తున్నాయి. ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి రోబోనే. దీన్ని ‘సవియోక్’ అనే కంపెనీ తయారుచేసింది. ఈ రిలే రోబోలు మూడడుగుల ఎత్తు ఉంటాయి. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందంటే.. మనం రూం సర్వీసుకు కాల్ చేయగానే.. అక్కడి సిబ్బంది వినియోగదారుడికి కావాల్సిన వస్తువులను ఈ రిలే రోబోట్ పైన ఉన్న భాగంలో ఉంచుతారు. దాని మీద ఉన్న ఎల్ఈడీ తెరపై రూం నంబర్ టైప్ చేయగానే.. అది వైఫై, కెమెరాల సాయంతో తనకు తానుగా ఆ రూం వద్దకు వెళ్లిపోతుంది.
అక్కడికి వెళ్లగానే.. రోబో నుంచి గది లోపల ఉన్న ఫోన్కు తాను వచ్చినట్లు తెలుపుతూ.. ఆటోమేటిక్గా కాల్ వెళ్లిపోతుంది. వినియోగదారులు తమకు కావాల్సిన సామాన్లు తీసుకోగానే.. రోబో తిరిగి చార్జింగ్ స్టేషన్కు వెళ్లిపోతుంది. ప్రస్తుతం 12 రోబోలు సర్వీసులో ఉన్నాయని.. భవిష్యత్తులో వాటి సంఖ్య మరింత పెరగనుందని ‘సవియోక్’ సీఈవో స్టీవ్ చెప్పారు. 2015లో ఈ రోబోల బృందం మొత్తం 11 వేల డెలివరీలు(సామాన్ల చేరవేత) చేశాయన్నారు.