మేలో కబాలి?
ఏ చిత్రం ఎంత భారీ విజయాన్ని సాధించి రికార్డులు బద్దలు కొట్టినా, సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రానికి ఉండే క్రే జే వేరు.ఆయన చిత్రాలపై అభిమానుల్లో ఏర్పడే ఆసక్తి,అంచనాలు ప్రత్యేకమే. మూడు దశాబ్దాలకు పైగా తనకే సొంతమైన సూపర్‌స్టార్ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్న రజనీకాంత్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారన్నది తెలిసిన విషయమే.అందులో ఒకటి 2.ఓ(ఎందిరన్-2)కాగా, రెండోది కబాలి. వీటిలో ముందు గా తెరపైకి రావడానికి కబాలి చిత్రం ముస్తాబవుతోంది.
గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న రజనీకాంత్‌తో నటి రాధికాఆప్తే తొలిసారిగా జత కడుతున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.పిక్చర్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు.షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సూపర్‌స్టార్ చిత్రం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఆయన ప్రతి అభిమానితో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి ఉంటుందని ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు.అలాంటి వారి కోసం కబాలి చిత్రానికి సంబంధించి పది అంశాలను తెలియజేస్తున్నాం.
1.సూపర్‌స్టార్ ఇందులో పెద్ద దాదాగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు బృందంలో ఒక సభ్యుడిగా నటుడు దినేశ్ నటిస్తున్నారు.ఈయన రజనీకాంత్ స్టైల్, మ్యానరిజమ్ లాంటివి ఫాలో అవుతూ తదుపరి గ్యాంగ్‌స్టర్ కావాలని కలలు కంటుంటారు.
2.రజనీకాంత్ ఒక పాఠశాలను నడుపుతుంటారు.అందులో నటుడు కలైయరసన్ ఉపాధ్యాయుడిగా నటిస్తున్నారు.
3.రజనీకాంత్‌కు స్నేహితుడిగా అమీర్ అనే పాత్రలో నటుడు జాన్ విజయ్ నటిస్తున్నారు.
4.కబాలి(రజనీకాంత్)కి సలహాదారుడిగా సీనియర్ నటుడు సంగిలి మురుగన్ నటిస్తున్నారు.
5.ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్ 75 రోజులు గడ్డంతో నటించడం విశేషం.
6. ఇందులో రజనీకాంత్, రాధికాఆప్తేల రొమాన్స్ సన్నివేశాలను గోవాలో చిత్రీకరించారు. వారి మధ్య స్వచ్ఛమైన ప్రేమకు ఆ సన్నివేశాలు తార్కాణంగా నిలుస్తాయట.
7. నటి ధన్సిక థాయ్‌ల్యాండ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించడం విశేషం.ఈ పాత్ర కోసం ఆమె తన పొడవైన కురులను త్యాగం చేసి బాబీకటింగ్లో చిత్రం అంతా కనిపంచనున్నారు.
8. కబాలి చిత్రాన్ని 115 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు.
9. చిత్రం షూటింగ్‌ను చైన్నై, దుబాయ్, థాయ్‌ల్యాండ్, గోవాలలో నిర్వహించారు.
10. రజనీకాంత్ ఆత్మవిశ్వాసంతో కూడిన కోపకారిగా నటించారు.ఇందులో ఆయనకు పంచ్ డైలాగ్స్ ఉం డక పోయినా ప్రతి సంభాషణలోనూ చక్కని సందేశం ఉంటుందట.కబాలి చిత్రంలో ఇవి మచ్చుకు మాత్రమే.రజనీకాంత్ అభిమానుల్ని అలరించే అంశాలు చాలా ఉన్నాయంటున్నారు చిత్ర వర్గాలు. చిత్రాన్ని మేలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.