గ్యాస్ ధరలపై పరిమితి విధించాలి
ఆర్థిక శాఖ పునరుద్ఘాటన
న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానం కింద గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెరిగిపోకుండా పరిమితులు ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. ఇటు ప్రభుత్వ, అటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇది కీలకమని పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీ ఇస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్యాస్‌కి కూడా కొత్త రేటును వర్తింపచేసే అంశంపై చమురు శాఖ పంపిన కేబినెట్ నోట్ ముసాయిదాపై ఆర్థిక శాఖ ఈ మేరకు తన అభిప్రాయాలు వెల్లడించింది. గ్యాస్ ధరపై పరిమితులు ఉండాలంటూ జూలై 4, సెప్టెంబర్ 26న స్పష్టం చేసిన ఆర్థిక శాఖ తాజాగా కూడా అదే విషయం పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు ఎగిసినప్పుడు దేశీ గ్యాస్ ఉత్పత్తి కంపెనీలు అనుచిత లబ్ది పొందకుండా ఇటువంటి చర్యలు అవసరమని ఆర్థిక శాఖ భావిస్తోంది.
ఎరువుల కంపెనీలు, విద్యుదుత్పత్తి సంస్థలకు కీలకమైన గ్యాస్‌పై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఒకవేళ అంతర్జాతీయ రేట్ల పేరు చెప్పి దేశీ గ్యాస్ ఉత్పత్తి కంపెనీలు అడ్డగోలుగా రేట్లు పెంచేస్తే ఖజానాపై సబ్సిడీ భారం పెరిగిపోతుంద న్నది ఆర్థిక శాఖ ఆందోళన. ప్రస్తుతం యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్ ధర 4.2 డాలర్ల స్థాయిలో ఉండగా కొత్త ఫార్ములా ప్రకారం రెట్టింపై 8.2-8.4 డాలర్ల స్థాయికి పెరుగుతుంది. ధరలను ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తారు.