రిటైర్మెంట్ దృష్ట్యా ఈక్విటీ పెట్టుబడులు తగ్గించాలా?
నేను 2007 సంవత్సరంలో రిలయన్స్ ట్యాక్స్ సేవర్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో రూ.20,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పటివరకూ డివిడెండ్‌గా రూ. 11,600 వచ్చాయి. ఈ ఫండ్‌లోనే కొనసాగమంటారా? లేక ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా?
- సౌదామిని, విశాఖ పట్టణం
రిలయన్స్ ట్యాక్స్ సేవర్ అనేది త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ట్యాక్స్ సేవింగ్ ఫండ్. అన్ని ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీకు అత్యవసరం అయినప్పుడు ఈ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోలేకపోవడం ఈ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఉండే ఒక ప్రధానమైన లోపం. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్కు కూడా ఇదే(మూడేళ్ల) లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది.
ఒక్కో డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఇన్వెస్ట్ చేసిన కాలం నుంచి మూడేళ్ల కాలాన్ని లాకిన్ పీరియ డ్గా పరిగణిస్తారు. మీ చివరి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసి మూడేళ్లైన తర్వాతనే మీరు మీ సొమ్ములను వెనక్కి తీసుకోవచ్చు. మీరు ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకుంటే.. మీ ప్లాన్‌ను డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ నుంచి డివిడెండ్ పేఅవుట్కు మార్చుకోండి. ఈ ప్లాన్‌లో మీకు డివిడెండ్లు క్రమానుగతంగా అందుతాయి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మిగిలిన సొమ్ములను పొందవచ్చు.
నాకు ఇటీవలనే వివాహమైంది. నా భార్య కూడా ఉద్యోగస్తురాలే. ఇప్పుడు నేను నెలకు రూ. 15,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. యులిప్‌ల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా లేక మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? తగిన సలహా ఇవ్వగలరు.
- బాబ్జి, కరీంనగర్
ముందుగా మీ ఇద్దరి జీతాలకు సంబంధించి ఆర్నెల్ల మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోండి. ఈ నిధి సమకూరిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. ఇన్వెస్ట్‌మెంట్‌కు గానీ, బీమా అవసరాలకు గానీ యూలిప్‌లు అనువైనవి కావు. పైగా యులిప్‌ల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. యులిప్‌లు మొదటి 5-6 సంవత్సరాల్లో కనీసం 5-6 శాతం మొత్తాన్ని వ్యయాల కింద తీసేసుకుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఈ వ్యయాల శాతం 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకే ఉంటాయి.
అంతే గాక పనితీరు బాగా లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోవచ్చు. యులిప్‌ల్లో అలా ఉండదు. పనితీరు బాగా ఉన్నా, బాగోలేకపోయినా యులిప్‌ల్లో కనీస లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు పారదర్శకంగా ఉంటాయి. యులిప్‌లు దీనికి భిన్నం. మీ ఆర్థిక అవసరాలు, బడ్జెట్, భరించగలిగే రిస్క్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మంచి రేటింగ్, పనితీరు ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోండి. వాటిల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
నా మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 70 శాతం వరకూ ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఉన్నాయి. మిగిలినవి ఈక్విటీల్లో ఉన్నాయి. నా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో వీటిని ఇన్వెస్ట్ చేశాను. వీటిల్లో నా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం విలువ రూ.30 లక్షల వరకూ ఉంటుంది. నేను త్వరలో రిటైర్ కాబోతున్నాను. ఈ దృష్ట్యా ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లోకి మారుద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా?
- ఇంతియాజ్, హైదరాబాద్
రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈక్విటీకి స్వల్పభాగమే కేటాయించాలన్న భావనతో మీరు ప్రశ్న అడిగినట్లున్నారు. కానీ ఇది సరైనది కాదు. ఈక్విటీల్లో రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ, రాబడులు కూడా బాగా ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే రిటైర్మెంట్ తర్వాతనే మీకు అధికంగా రాబడులు అవసరం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు ఇవ్వలేవు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని దీటుగా తట్టుకునే రాబడులను పొందవచ్చు. అందుకని ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకోవాలన్న మీ ఆలోచన సరైనది కాదు. వాటిని కొనసాగించండి.