భారత్‌లో మత స్వేచ్ఛ క్షీణిస్తోంది
మైనారిటీలపై దాడులు పెరిగాయి: అమెరికా కమిటీ నివేదిక
వాషింగ్టన్: భారత్‌లో మత స్వేచ్ఛ గత ఏడాది(2015లో) తిరోగమనంలో ఉందని.. మత సహనం క్షీణించిందని, మత స్వాతంత్య్ర ఉల్లంఘనలు జరిగాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా నివేదిక ఒకటి పేర్కొంది. అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్ నియమిత యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) సోమవారం విడుదల చేసినవార్షిక నివేదికలో.. మత ప్రజాసమూహాలకు వ్యతిరేకంగా అవమానకరంగా మాట్లాడే అధికారుల, మత నాయకుల వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
మైనారిటీ మతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు ప్రధానంగా హిందూ జాతీయవాద బృందాల చేతుల్లో పలు అవమానకర, వేధింపులు, హింసకు గురయ్యారని నివేదిక ఆరోపించింది. అధికార బీజేపీ సభ్యులు లోపాయికారీగా ఈ బృందాలకు మద్దతు ఇచ్చారని, ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టేందుకు మతపరంగా విభజనపూరిత భాషను వినియోగించారంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మతప్రేరేపిత దాడులు, మత హింస ఘటనలు అధికమని నివేదిక పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ను నివేదిక టైర్-2 వర్గంలో చేర్చింది.