రిమాండ్ ఖైదీ ఆత్మహత్య కలకలం..!
రిట్ పిటిషన్ వేసినందుకేనా..?
బెయిల్ రాదనే మనస్తాపమా..
హత్య చేస్తారనే ఆందోళనా..
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు
ఇవే కారణాలా..?
సోదరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ-1 నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న మృతుడు వెంకటేశ్వర్లు
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఆత్మహత్య జిల్లాలో కలకలం రేపింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేశ్వర్లుపై దాయాదులు రిట్ పిటిషన్ వేయడంతో జీవితాంతం జైలులో మగ్గుతాననే మనస్తాపం చెంది లేదా బెయిల్‌పై బయటికి వస్తే ప్రత్యర్థులు హతమారుస్తారనే ఆందోళనలోనే అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసుల అధికారులు భావిస్తున్నారు.
ఎవరీ వెంకటేశ్వర్లు..
మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధి బండతెరపుతండాకు చెందిన అజ్మీర వెంకటేశ్వర్లు(35), అజ్మీర భంగ్యా సోదరులు. తమకున్న ఎకరంన్నర భూమిని చెరిసగం పంచుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పంచుకున్న చెరి 30 గుంటల భూమిలో అన్న అజ్మీర వరి సాగు చేయగా, తమ్ముడు వెంకటేశ్వర్లు కూరగాయలు సాగు చేసుకుం టున్నాడు. అయితే బోరు నీటి పంపకాల విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదాలు జరుగుతున్నా యి. ఈ నేపథ్యంలోనే గత ఆగస్ట్ 12న వెంకటేశ్వర్లు, అతడి భార్య వనీత కలిసి వ్యవసాయ భూమి వద్దనే అజ్మీర భంగ్యా తలపై ఇనుపరాడ్‌తో మోది హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో వెంకటేశ్వర్లు ఏ-1, వనీత ఏ-2 నిందితులుగా గత ఆగస్ 18వ తేదీ నుంచి మిర్యాలగూడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటున్నారు.
జైలులో ఏం జరిగింది..
సోమవారం బ్యారక్‌ను (ఖైదీలు నిర్ణయించుకుని ప్రకా రం) వెంకటేశ్వర్లు ఆర్పిక్ యాసిడ్‌తో శుభ్రపరిచాడు. ఆ క్రమంలోనే కొబ్బరి నూనె డబ్బాలో యాసిడ్‌ను తీసుకుని బ్యారక్‌లో ఓ చోట దాచి పెట్టుకున్నాడు. సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో భోజనం చేసి ఖైదీ లందరూ తమ బ్యారక్‌లోకి వెళ్లిపోయారు. రాత్రి 11:30 గంటల సమయంలో వెంకటేశ్వర్లు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. తోటి ఖైదీలు గమనించి యాసిడ్ తాగినట్టుగా గుర్తించారు. వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 5 గంటలకు వృుతిచెందాడు.
భూమి ఇవ్వాల్సి వస్తోందనా..?
వెంకటేశ్వర్లు భార్య వనీత కొద్ది రోజుల క్రితమే బైల్‌పై విడుదలైంది. 80రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటు న్న వెంకటేశ్వర్లుకు మరి కొద్దిరోజుల్లో బైల్ వచ్చే అవకావమున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో బైల విడుదలైన భార్య వనీత గతంలో హత్యకు గురైన భంగ్య కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ వాతవరణం ఏర్పడింది. ఈ క్రమంలో హత్యకు గురైన భంగ్యా కుటుంబానికి ఎకరం పొలం రాసివ్వాలనే ప్రతి పాదన వచ్చినట్లు దానికి వెంకటేశ్వర్లు భార్య వనీత ఒప్పుకోలేదని సమాచారం. దీంతో వారు వెంకటేశ్వర్లుకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు రిట్ పిటిషన్ వేసినట్టు తెలిసింది. అంతే కాకుండా ఒక వేళ బయటికి వచ్చిన వెంటనే తనను కూడా చంపుతారనే..? అనే భయంతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మృతుడు వెంకటేశ్వర్లుకు కుమారుడు విష్ణు, కూతురు పూర్ణ తేజిత ఉన్నారు. ఆర్డీఓ కిషన్‌రావు ఇతర అధికారులతో కలిసి ఆత్మహత్యపై వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్టు తెలిపారు.
ఏరియా ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన..
వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న విషయం గ్రామంలో తెలియడంతో బంధువులు ఏరియా ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. పోస్టుమార్టం గదికి వారి ని వెళ్లనీయకపోవడంతో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీ సురభి రాంగోపాల్‌రావు, సీఐ దూసరి భిక్షపతి అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులతో చర్చించారు. దహన సంస్కారాల నిమిత్తం సహాయంగా రూ.20వేలు వారికి అందజేసి ఆందోళనను విరమింపచేశారు.