పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాల్సిందే
రాజంపేట రూరల్: డీసీసీ బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులందరూ తక్షణమే రెన్యువల్ చేసుకోవాలని డీసీసీబీ సీఈఓ ఏ.జయరామిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోమ్‌లో డివిజన్ స్థాయి డీసీసీ బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట డివిజన్‌కు రుణమాఫీ వర్తించడం లేదన్నారు. పండ్ల తోటలకు అందచేస్తామన్న రుణమాఫీ రూ.10వేలు ఇంకా మంజూరు కాలేదని వెల్లడించారు. రైతులు తక్షణమే తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకుంటే 0శాతం వడ్డీ పడుతుందన్నారు.
ఒక సంవత్సరం దాటిన లోన్లకు 13శాతం వడ్డీ పడుతుందని తెలిపారు. ప్రభుత్వం అందచేసే రుణమాఫీ అర్హులైన వారికి అందితే అది వారి అకౌంట్లోనే జమ అవుతుందన్నారు. అందువలన రైతులకు వడ్డీ భారం తగ్గుతుందన్నారు. జిల్లాలో రూ.225కోట్లు క్రాఫ్ లోన్లు అందచేశామన్నారు. అందులో రూ .158 కోట్ల రుణం వరకు రెన్యువల్ అయిందన్నారు. మిగిలిన రూ.73కోట్లు క్రాఫ్లోన్లు కూడా రైతులు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.
రాజంపేట డివిజన్ పరిధిలోని రాజంపేట, పుల్లంపేట, కోడూరు, చిట్వేలి పరిధి లో సుమారు రూ.11కోట్లు మేరకు రైతులు ఇంకా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉందన్నారు. రైతులు తమ వద్దనున్న రికార్డులు, వన్‌బీ, అడంగల్, డిక్లరేషన్‌ను అందజేయాలని సూచించారు. లక్షరూపాయలు వరకు రెన్యువల్ చేసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఎం.ప్రభాకర్‌రావు, ఏజీఎం టీవీ సుబ్బారెడ్డి, సబ్ డివిజనల్ కో-ఆర్డినేటర్ కె.సుబ్బరాయుడు, రాజంపేట సీనియర్ ఇన్స్పెక్టర్ శెట్టెం వెంకటరమణ, డివిజన్ పరిధిలోని 8బ్రాంచ్‌లకు చెందిన డీసీసీబీ బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లు, సంఘాల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు.