అద్దెకు స్నేహితులు!
అద్దెకు స్నేహితులు ఎంటా? అనుకుంటున్నారా.. అవునండీ.. rentafriend.com, rentalocalfriend.com వెబ్ సైట్లు స్నేహితులను అద్దెకు పంపిస్తున్నాయి. ఇప్పుడు దేశ రాజధానిలో ఈ ట్రెండ్ పెరిగిపోతోంది. ఖాళీగా, మూడీగా ఉండే వారందరూ(అమ్మాయైనా, అబ్బాయైనా) ఈ వెబ్ సైట్ల ద్వారా రిజిస్టర్ అయి కొత్త స్నేహితులను కలుసుకుంటున్నారు. ఒక్క కాఫీకే పరిమితం కాకుండా సినిమా, డిన్నర్ విత్ పేరెంట్స్ ఇలా సర్వీసులు మారే కొద్ది అద్దె పెరుగుతూ ఉంటుంది.
ప్రస్తుతం ఒక గంటసేపు కాఫీకి సమయాన్ని వెచ్చిస్తే రూ.600లు చెల్లించాల్సి వస్తోంది. ఈ కల్చర్ పై ఆయా వెబ్ సైట్ల ప్రతినిధులను సంప్రదించగా.. మోసాలకు అవకాశం లేకుండా కేవలం చెప్పిన సమయానికి మాత్రమే అద్దెకు స్నేహితులను కలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం మొదట రూ.1,000 నుంచి రూ.1,500లు మెంబర్ షిప్ కింద వినియోగదారులు చెల్లించాల్సివుంటుందని తెలిపారు. ఆ తర్వాతే తమ సేవలను వినియోగించుకోగలరని చెప్పారు. అయితే, సభ్యుల పూర్తి వివరాలను తీసుకోవడంలేదని వివరించారు.
సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో కూడా 'మీట్ ఫ్రెండ్స్', 'లవ్ ఆన్ హైర్', 'బీఎఫ్స్ ఆన్ ఎన్సీఆర్' వంటి పేజీలు గంటల బేసిస్ మీద ఫ్రెండ్స్, లవర్స్ ను అద్దెకు ఇస్తున్నాయి. వీటిలో 'లవ్ ఆన్ హైర్' అనే ఫేస్ బుక్ పేజీని 25,000 మందికి పైగా ఫాలో అవుతున్నారు. వీటిపై మాట్లాడిన కొంతమంది యూత్ పేజీల సాయంతో కొత్త వ్యక్తుల పరిచయంతో పాటు మీటింగ్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠత కూడా కలుగుతోందని అన్నారు. యూత్ లో ప్రస్తుతం పెరుగుతున్న ఈ కల్చర్ వారి స్వభావాలకు అద్దం పడుతోందని నిపుణులు చెప్పారు. యూత్ తమ సోల్ మేట్ ను నిర్ణయించుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.