కేటీపీపీలో కొనసాగుతున్న మరమ్మతులు
విద్యుత్ ఉత్పత్తికి మరో నాలుగు వారాలు పట్టే అవకాశం
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. శనివారం బీహెచ్ఈఎల్కు చెందిన ఆరుగురు ఇంజనీర్ల బృందం జనరేటర్‌ను పరిశీలించింది.
ఈసందర్భంగా జనరేటర్‌ను రెండు భాగాలుగా వీడదీసి గమనించగా కోర్స్ భాగంలో లోపం బయటపడింది. జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, రాధాకృష్ణ మరమ్మతులను పర్యవేక్షించారు. ప్లాంట్‌లో సంవత్సరం పాటు మరమ్మతులు చేసే బాధ్యత బీహెచ్ఈఎల్ కంపెనీదే కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి అనుభవం కల్గిన ఇంజనీర్లను రప్పిం చారు. జనరేటర్లో విడిభాగాలు విదేశాల నుంచి, కొన్ని చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నందున మరమ్మతులు పూర్తయ్యేందుకు దాదాపు నెల రోజులు పట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు.