Replacement of public employment
-
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి
నిరుద్యోగులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఐక్యవేదిక విజ్ఞప్తిపై స్పందన హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేసింది. వేదిక ప్రతినిధి లగుడు గోవిందరావుతోపాటు పలువురు నిరుద్యోగులు మంగళవారం లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయం లో జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ర్టంలో ఏపీపీఏస్సీ గ్రూప్-1,2,4, జేఎల్, డీఎల్, ఎస్సై, కానిస్టేబుల్, వీఆర్వో, పంచాయతీ, అటవీశాఖలోని పోస్టులన్నీ కలపి సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నిరుద్యోగులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేసేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇంటికో ఉద్యోగం అన్న వాగ్దానాన్నీ కూడా నెరవేర్చేలా చూడాలని విన్నవించారు. ఈ మేరకు నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తెచ్చి ఖాళీలు భర్తీ అయ్యేలా కృషి చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. కాగా, ఉద్యోగాల నియామకాల్లో ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ విధానాన్ని అమలు చేయాలని, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలనీ, ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే సంకల్ప దీక్షకు మద్దతివ్వాలని కూడా వారు జగన్‌ను కోరారు. జగన్‌ను కలసిన వారిలో కె.మహేష్, పి.శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు తదితరులు ఉన్నారు. -
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసి, పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఓయూలో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జే ఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయవద్దని, ఖా ళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్లతో చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓయూ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చాలన్నారు. ఉద్యోగాల కోసం ఓయూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన, ఉద్యోగాల భర్తీ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనునట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నరేందర్‌రెడ్డి, కిరణ్‌గౌడ్, వీరబాబు, మానవతారాయ్, కల్యాణ్, సోలంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.