నెలాఖరుకు అక్రమ-సక్రమ
రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసప్రసాద్
కమిటీల ఏర్పాటుతో క్రమబద్దీకరణకు చర్యలు
త్వరలో రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీ
వీఏఓ పోస్టుల నియామకం అధికారం కలెక్టర్లకు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి ఈ నెలాఖరులోగా అక్రమ-సక్రమ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. అలాగే ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వడానికి కూడా బగర్ హుకుం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
రెవెన్యూ శాఖ పద్దులపై గురువారం శాసన సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించడానికి మార్గదర్శక విలువను ఆధారం చేసుకునే విషయమై సభ ఆమోదం అవసరమవుతుందని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప మార్గదర్శక విలువలు అధికంగా ఉన్నాయని, కనుక ఖుష్కీ ధర ఆధారంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి సూచించారు.
కాగా భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించడానికి వీలైనంత త్వరగా చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశ పెడతామని వెల్లడించారు. రెవెన్యూ శాఖలో తహసిల్దార్ సహా అన్ని పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. విలేజ్ అకౌంటెంట్ పోస్టులను నేరు నియామకాల ద్వారా భర్తీ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తాలూకా కేంద్రాల్లో మినీ విధాన సౌధలు
రాష్ర్టంలోని అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో మినీ విధాన సౌధ సముదాయాలను నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. కాల పరిమితితో వీటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు 116 మినీ విధాన సౌధల నిర్మాణం పూర్తయిందన్నారు. రాష్ర్టంలోని 26 వేల గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇదో విప్లవాత్మకమైన కార్యక్రమమని, ఆ గ్రామాల్లో తరతరాలుగా పేదలు నివసిస్తూ, ప్రాథమిక సదుపాయాలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సదుపాయాలను కల్పించడానికి రెవెన్యూ గ్రామాలుగా మార్చాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.