చంద్రబాబుది షో
శ్రీకాళహస్తి : మాటలతో చంద్రబాబు షో చేస్తున్నారు. మినహా ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడం లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గపూర్ విమర్శించారు. నిధుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించలేక చంద్రబాబు ఊరికే షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం జిల్లా మహాసభ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతకుముందు సీపీఎం అరుణపతాకాన్ని ఆ పార్టీ రాష్ర్ట కమిటీ సభ్యుడు కృష్ణయ్య ఆవిష్కరించారు.
ప్రతినిధుల మహాసభలో గఫూర్ మాట్లాడుతూ రుణమాఫీపై రోజుకో నిర్ణయంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇక పోరాటాలు తప్పవని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుమార్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో దేవుళ్లకు (తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు,కాణిపాకం) సీఎంలకు కొదవలే దన్నారు. సమస్యలు తాండవం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తాగునీరు, సాగునీరు లేక సమస్యలతో ప్రజలు తిప్పలు పడుతున్నారని అన్నారు.
మన్నవరం లాంటి అద్భుతమైన పరిశ్రమ కనుమరుగైపోతుంటే పట్టించుకోకుండా కాసులు కురిపించే నూతన పరిశ్రమలపై దృష్టి సారిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పేదోడికి ఎకరం భూమి ఇవ్వమంటే మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లాలో తెలుగుతముళ్లు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేద ల కోసం ఎన్ని భూపోరాటాలు సాగించడానికైనా సిద్ధమన్నారు. పార్టీ జిల్లా నాయకుడు కందాటి మురళి, సురేష్, జనార్దన్, మణి, కుప్పమ్మ, సుబ్రమణ్యం, మురగారెడ్డి మాట్లాడారు.