హస్తిన అస్తవ్యస్తం!
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్, చలిగాలులు, వర్షం వీటన్నింటికి మించి ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు నలుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్ కోరుతూ నగరం నడిబొడ్డున గల కూడలి వద్ద ధర్నా కొనసాగించడంతో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు నెలవైన ధర్నా స్థలం పరిసరాల్లో మంగళవారం గందరగోళం నెలకొంది. ఢిల్లీ పోలీసులు ధర్నా స్థలానికి దారితీసే రోడ్లను మూసివేయడంతోపాటు పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రేస్ కోర్సు, ఉద్యోగ్ భవన్ స్టేషన్లను మూసివేయించడంతో ఉదయాన్నే ఈ ప్రాంతంలోగల ఆఫీసులకు బయలుదేరిన ఉద్యోగులు ఇక్కట్ల పాలయ్యారు. మెట్రో స్టేషన్లను మూసివేయడంతో పలువురు ఉద్యోగులు బస్సులను ఆశ్రయించారు.
కానీ భారీ బారికేడింగ్‌తో పలు రోడ్లను మూసివేయడంతో వాహనాలను దారిమళ్లించడం వల్ల అనేక చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఈ ఇబ్బందికి వర్షం తోడై ఉదయాన్నే ఆఫీసులకు బయలుదేరినవారిని ఇబ్బంది పెట్టింది. బస్స్టాండ్లలో జనం కిక్కిరిసి కనిపించారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడవలసి వచ్చిందని పలువురు ప్రయాణికులు చెప్పారు. చాలామంది కాలినడకన ఆఫీసులకు చేరుకున్నారు.
అనుక్షణం అప్రమత్తంగా పోలీసులు
రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాట్లకు ధర్నా వల్ల భంగం కలుగకుండా ఉండడం కోసం పోలీసులు మరింత శ్రద ్ధ వహించారు. సాధారణంగా మోహరించే స్థాయి కన్నా ఎక్కువ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. భారీ భద్రత కారణంగా ఇండియా గేట్ దాని పరిసరాలు పోలీసులతో నిండిపోయాయి. గుర్తింపు కార్డులు చూసిన తరువాతే పోలీసులు ఈ ప్రాంతంలో కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను బారికేడ్లు దాటి ముందుకు వెళ్లనిచ్చారు.
దూరాభారాలకు ఓర్చి ధర్నాలో పాల్గొనడం కోసం వచ్చిన ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులను పోలీసులు బారికేడ్లను దాటి ధర్నా స్థలానికి వెళ్లనివ్వలేదు. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు బారికేడ్లను కూల్చి లోపలికి ధర్నా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించడం పోలీసులు వారిని అడ్డుకోవడం... రోజులో పలుమార్లు జరిగాయి. ఆప్ నేతలు కార్యకర్తలను శాంతి యుతంగా ఆందోళన జరపవలసిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం కొందరు ఆప్ కార్యకర్తలు కృషిభవన్ వద్ద పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. రఫీ మార్గ్‌పై కూడా కార్యకర్తలు బారికేడ్లను దాటి దూసుకురావడానికి ప్రయత్నించారు. కార్యకర్తలు అదుపుతప్పినప్పుడల్లా పోలీసులు లాఠీలను ప్రయోగించారు. లాఠీ చార్జీలలో కొందర్ ఆప్ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఆప్ కార్యకర్తలు తమను రెచ్చగొట్ట్టడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు ఆరోపించారు.
ధర్నాలో పాల్గొనడానికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించరాదని గృహమంత్రిత్వశాఖ పోలీసులను ఆదేశించింది. ఓ పక్క ధర్నాకు మద్దతుగా వచ్చేవారిని అదుపుచేయడానికి ప్రయత్నిస్తుండగా, ధర్నాను వ్యతిరేకిస్తూ బీజేపీ, కాంగ్రెస్ నిర్వహించిన ప్రదర్శనలు పోలీసుల సమస్యను మరింత పెంచాయి. సీనియర్ పోలీసు అధికారులు ధర్నా స్థలానికి మధ్య మధ్య వచ్చి శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించారు. ధర్నా వల్ల తలెత్తుతోన్న పరిస్థితిపై హోంశాఖ అధికారులు, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమావేశాలు జరిపారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ జనాలు గుమిగూడుతున్నారని, ధర్నా జరుగుతోందని, లౌడ్ స్పీకర్లు వాడుతున్నారని.. ఇవన్నీ నిషేధాజ్ఞల ఉల్లంఘనలకిందకే వస్తాయని పోలీసులు చెప్పారు. ధర్నా స్థలాన్ని రైల్‌భవన్ వద్ద నుంచి మరోచోటి మార్చడానికి నిరాకరించి కేజ్రీవాల్ పోలీసులతోపాటు ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఇరుకున బెట్టారు.
నిర్మానుష్యంగా ప్లేయర్స్ బిల్డింగ్
ధర్నా జరిగినన్ని రోజులు ముఖ్యమైన ఫైళ్లను తీసుకుని ధర్నా స్థలానికి రావాలని అధికారులకు ఆదేశాలు అందడంతో అధికారులు సచివాలయం నుంచి ధర్నా స్థలానికి, ధర్నా స్థలాన్నుంచి సచివాలయానికి ఫైళ్లతో పరుగులు తీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ లేకపోవడంతో సందడితో కళకళలాడే ప్లేయర్స్ బిల్డింగ్ నిర్మానుష్యంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటినుంచి సచివాలయంలో అడుగడుగునా దర్శనమిస్తోన్న ఆప్ కార్యకర్తలు మాయమయ్యారు. కీలకమైన ఫైళ్లను అధికారులు సచివాలయం నుంచి తీసుకుచ్చిన అధికారులను పోలీసులు వారి గుర్తింపు కార్డులను చూసి బారికేడ్లను దాటేందుకు అనుమతించారు. ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఫైళ్లు మంత్రుల ముందుంచి వారి సంతకాలు చేయించి తీసుకెళ్లడం కనిపించింది. సోమవారం కూడా ముఖ్యమంత్రి. ఆప్ మంత్రులు దాదాపు 50 ఫైళ్లను పరిశీలించారని సచివాలయ సిబ్బంది చెప్పారు.