‘సూపర్ ట్యూస్డే 2.0’పై ఉత్కంఠ
తేలనున్న రూబియో, కసిచ్‌ల భవితవ్యం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్న మార్క్ రూబియో, జాన్ కసిచ్‌ల భవితవ్యం మంగళవారం జరిగే పోరుతో తేలిపోనుంది. ‘సూపర్ ట్యూస్డే 2.0’లో భాగంగా ఐదు రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు తలపడుతుండగా... కీలకమైన ఫ్లారిడా, ఒహయోలపైనే అందరి దృష్టి నెలకొంది. రూబియో ఫ్లారిడా నుంచి సెనేటర్ కాగా, కసిచ్ ఒహయో గవర్నర్‌గా ఉన్నారు. అధ్యక్ష అభ్యర్థి బరిలో నిలవాలంటే రూబియో, కసిచ్‌లు సొంత రాష్ట్రాల్లో గెలవాల్సిన అవసరముంది. మరోవైపు రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు నిరసనగా కొన్ని రోజులుగా షికాగో, ఒహయోలో ర్యాలీలు జరగడంతో ఈ ప్రైమరీలపై ఆసక్తి నెలకొంది.
అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోవాలంటే ట్రంప్ ఆ రెండు రాష్ట్రాల్లో గెలవాలి. ట్రంప్ 14 రాష్ట్రాల్లో గెలిచి 460 మంది ప్రతినిధుల మద్దతు సాధించగా... టెడ్ క్రూజ్ 7 రాష్ట్రాల్లో గెలుపొంది 360 మంది మద్దతు సాధించారు. ఫ్లారిడా, ఒహయోలతో పాటు ఇలినాయ్, మిస్సోరీ, నార్త్ కరోలినా, ఉత్తర మారియానా దీవుల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 360 మంది ప్రతినిధులు ఓటు వేస్తారు. ఒహయోలో ట్రంప్, కసిచ్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంని అంచనా. కసిచ్‌కు రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నీ మద్దతు తెలపడంతో పాటు ప్రచారంలో కూడా పాల్గొంటానని చెప్పారు. ట్రంప్‌ను ఓడించాలంటూ ఆయన బహిరంగంగానే పిలుపునిచ్చారు.