గందరగోళంగా బదిలీ ప్రక్రియ!
– రీజనరేట్‌కు నోచుకోని పాయింట్లు
– ప్రారంభం కాని సర్టిఫికెట్ల పరిశీలన
– ఆందోళనలో ఉపాధ్యాయులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రక్రియ గందరగోళంగా మారింది. షెడ్యూలు ప్రకారం 6వ తేదీ నాటికే వివిధ పాయింట్లు రీజనరేట్ కావాల్సి ఉంది. కానీ శుక్రవారం రాత్రి వరకు పాయింట్లు జనరేట్ కాలేదు. అలాగే శుక్రవారం నుంచే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా... ఇప్పటిదాకా అతీగతీ లేదు. మరోవైపు బదిలీకి దరఖాస్తు చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాయింట్ల విషయంలో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సర్టిఫికెట్ల పరిశీలన 10వ తేదీ ముగుస్తుండడంతో హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తికావడంపై పలువురు ఎంఓఈలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా బదిలీ నిబంధనలను స్వల్పంగా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
–అప్‌గ్రేడ్ అయిన పీఈటీ, పండిట్లకు వారు పని చేసిన పాత స్కూళ్ల సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుని పాయింట్లు జమ చేస్తారు.
– 2015లో జరిగిన బదిలీల్లో ఆలస్యంగా రిలీవ్ అయిన వారు బదిలీకి అర్హులు.
– అంతర్జిల్లా బదిలీల టీచర్లకు వారి మొత్తం సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుని పాయింట్లు లెక్కిస్తారు.
– ప్రిపరెన్షియల్ కేటగిరీలో గతంలో 8 సంవత్సరాలు ఉండేది. తాజాగా 8 అకడమిక్ ఇయర్‌గా పరిగణిస్తారు.
– ప్రభుత్వ పాఠశాలల్లో సర్‌ప్లస్‌గా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను అవసరమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు.