ప్రశ్నించిన చూపులు!
ఫొటో స్టోరీ
ఈమె కళ్లలో ఏం కనిపిస్తోంది? ఎవ్వరూ సమాధానం చెప్పలేని ఓ ప్రశ్న కదలాడుతున్నట్టుగా అనిపించడం లేదూ!
అవును. ఆమె నిజంగానే ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని... వారి నిర్లక్ష్యాన్ని!
అధికారుల్ని... వారి అలక్ష్యాన్ని! జనాలని... వారి నిస్సహాయతని!
నవంబర్ 13, 1985. కొలంబియాలోని నెవడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం బద్దలై నిప్పులు కక్కింది. లావా పరవళ్లు తొక్కింది. చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాలను అతలాకుతలం చేసింది. వాటిలో అర్మెరో ఒకటి. అగ్నిపర్వతానికి అతి దగ్గరలో ఉన్న ఆ ఊరిలోనే ఉండేది ఒమైరా సాంచెజ్ (13) కుటుంబం. అగ్నిపర్వతం బద్దలయ్యే సమయానికి ఇంట్లోవాళ్లంతా బయటకు వెళ్లారు. పిన్నితోపాటు ఒమైరా మాత్రమే ఉంది. ఇల్లు కూలిపోయింది. బురద ముంచెత్తింది. పిన్ని చనిపోయింది. ఒమైరా బురద, కాంక్రీటు, నీరు కలిసిన మడుగులో చిక్కుబడిపోయింది.
తెల్లారేసరికి రెస్క్యూ టీములు వచ్చాయి. ఒమైరాని బయటకు తీసే ప్రయత్నాలు మొదలెట్టాయి. కానీ ఆమె కాళ్లు ఇటుకల మధ్య ఇరుక్కుపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఓ దుంగను ఆసరాగా పట్టుకుని మూడు రాత్రులు అలానే ఉండిపోయింది ఒమైరా. నన్ను కాపాడలేరా అన్నట్టుగా ఆమె దీనంగా చూస్తుంటే అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టారు.
అవసరమైతే ఆమె కాళ్లు కోసేసి అయినా బయటకు లాగేయాలనుకున్నారు. కానీ తక్షణ చికిత్స అందించే అవకాశం లేకపోవడంతో... ఆమెనలా చనిపోనివ్వడమే మంచిదనుకున్నారు. విషయం తెలిసినా నాయకులు గానీ, అధికారులు గానీ ఆమెను కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. అరవై గంటల పాటు నరకయాతన అనుభవించింది ఒమైరా. ఒళ్లంతా పాలిపోయింది.
ముఖం ఉబ్బిపోయింది. కళ్లు వాచి, ఎర్రబడ్డాయి. ‘ఇక నన్నిలా వదిలేయండి, మీరెళ్లి విశ్రాంతి తీసుకోండి’ అని చెప్పింది. ఆసరాగా పట్టుకున్న దుంగను మెల్లగా వదిలేసింది. నిస్సహాయంగా ప్రాణాలు విడిచింది. అంతకు కొద్ది నిమిషాల ముందు ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఫ్రాంక్ ఫార్నియర్ ఈ చిత్రాన్ని తీశాడు. ప్రపంచ నేత్రాన్ని చెమ్మగిల్లేలా చేశాడు. పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్నాడు!