Research Centre Imarat
-
డీఆర్డీఎల్ డైరెక్టర్‌గా శ్రీనివాసమూర్తి
సాక్షి, హైదరాబాద్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జి.ఎ.శ్రీనివాస మూర్తి నియమితులయ్యారు. డాక్టర్ దశరథ్ రామ్ ఉద్యోగ విరమణ తరువాత ఆయన స్థానంలో డైరెక్టర్ అండ్ డీఎస్‌గా జి.ఎ.శ్రీనివాసమూర్తిని నియమించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన డీఆర్డీవో అనుబంధ సంస్థ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్ (రీసెర్చ్ సెంటర్ ఇమారత్)లో డీఆర్డీఎల్ ఒక భాగమన్న విషయం తెలిసిందే. డైరెక్టర్‌గా నియమితులయ్యే ముందు వరకూ జి.ఎ.శ్రీనివాస మూర్తి అడ్వాన్స్డ్ నావల్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసమూర్తి 1986లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఈ (1997) పట్టా పొందారు. 1987లోనే డీఆర్డీఎల్లో చేరిన ఆయన స్ట్రక్చరల్ డైనమిక్స్, గ్రౌండ్ రెజొనెన్స్ టెస్టింగ్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ వంటి అంశాల్లో కృషి చేశారు. మిస్సైల్ కాంప్లెక్స్ చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. -
నేడు ‘ఆర్సీఐ’ రజతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: దేశానికే గర్వకారణమైన రక్షణ పరిశోధన సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) రజతోత్సవాలకు సిద్ధమవుతోంది. దీన్ని పురస్కరించుకుని ఈనెల 26న కాంచన్‌బాగ్‌లోని ఆర్సీఐ ప్రధాన కేంద్రంలో జరిగే వేడుకలకు గవర్నర్ నరసింహన్‌తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రక్షణశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ హాజరుకానున్నారు. 1984లో కలాం ఆలోచనల మేరకు ఈ కేంద్రం ఏర్పాటుకు అంకురం పడగా, 1985 ఆగస్టు 3న అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ శంఖుస్థాపన చేశారు. 1988 ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్ జాతికి అంకితమిచ్చారు. అబ్దుల్ కలాం, లెఫ్టినెంట్ జనరల్ వి.జె.సుందరం, కెవిఎస్ఎస్ ప్రసాదరావు, వి.కె.సారస్వత్, ఎస్.కె.రే, అవినాశ్ చందర్, ఎస్.కె.చౌదరీ లాంటి దిగ్గజ శాస్త్రవేత్తల నేతృత్వంలో పలు విజయాలు సాధించిన ఈ సంస్థకు ప్రస్తుతం జి.సతీశ్‌రెడ్డి సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. అగ్ని, పృథ్వీలతోపాటు దేశీయ క్షిపణులన్నింటికీ అవసరమైన ఏవియానిక్స్ వ్యవస్థల డిజైనింగ్, తయారీ జరిగేది ఈ కేంద్రం లోనే. హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్‌లో ఉన్న ఆర్సీఐ రక్షణ రంగంలో స్వావలంబన సాధిం చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.