తండ్రి అయ్యానన్న భావనతో పురుషుల్లో మార్పు!
న్యూయార్క్: తండ్రి అయ్యానన్న భావన పురుషుల మెదడులో మార్పులకు కారణమవుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా శిశువుకు జన్మనివ్వగానే తల్లిలో కలిగే మార్పులు, తండ్రులలోనూ ఉంటాయని వీరు చెబుతున్నారు. తమ చిన్నారుల రక్షణ విషయంలో తల్లిలోని మెదడు, తండ్రిలోని మెదడు ఒకే విధమైన నాడీ కణాల వలయాన్ని ఉపయోగించుకుంటాయని ఈ పరిశోధనలో తేలింది. ఈ ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లో ప్రచురితమయ్యాయి. చిన్నారుల సంరక్షణ తండ్రి మెదడు పనితీరును మార్చేస్తుందని, ఇది తల్లుల్లో ఉండే భావోద్వేగ, ప్రవర్తనా మార్పుల్లా ఉంటుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అధ్యయనంలో భాగంగా కొత్తగా తల్లిదండ్రులైన 89 మందికి పిల్లలతో గడుపుతున్న వీడియోలను చూపించారు. ఆ సమయంలో వారి మెదడులో జరిగే మార్పులు, తీరును శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. పిల్లల బాగోగులను చూసుకునే తండ్రుల్లోని భావోద్వేగ పరమైన మార్పులు, అవే బాధ్యతలను చూసే తల్లుల్లో వలే ఉన్నట్లు వెల్లడైంది.