కంటతడి పెట్టించిన కిరాతకం
నిజామాబాద్ క్రైం/దూలపల్లి, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు పసిపిల్లల్ని కిరాతకుడు చిదిమేసిన ఘటన నగర శివారు దూలపల్లిలోని అలేఖ్య రెసిడెన్సీలో కలకలం రేపింది. అప్పటివరకు ఆడిపాడిన పిల్లలు అంతలోనే మంటల్లో మాడి మసైపోయారని తెలిసి తల్లిదండ్రులు కలవరపడ్డారు. పిల్లల్ని పొట్టన పెట్టుకుని కన్న వారికి గర్భశోకాన్ని మిగిల్చిన వ్యక్తి పిల్లలకు వరుసకు బాబాయి కావడం అందర్నీ కలచివేసింది. ఈ దారుణానికి పాల్పడిన నరేందర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బాసరలోని గోదావరిలో దూకినట్లు అనుమానాలుండటంతో పోలీసులు గాలిస్తున్నారు.
పెళ్లికి వెళ్లి..
నిజామాబాద్ జిల్లాకు చెందిన రఘపతి రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గంగారెడ్డి, ఆయన భార్య హరిత, కుమార్తె సిరి (8) , రాజిరెడ్డి, భార్య చైతన్య, కుమార్తె ఖుషి (6)తో కలిసి కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లిలోని అలేఖ్య రెసిడెన్సీ 204, 101 ఫ్లాట్ల లో ఉంటున్నారు. మరో కుమారుడు సాయిరెడ్డి, భార్య, కుమారుడు, కుమార్తె అక్షయ (6)తో కలిసి తండ్రితోనే కలిసి ఉంటున్నా రు.
నిజమాబాద్‌లో జరిగే బంధువుల పెళ్లికి గంగారెడ్డి, రాజిరెడ్డి భార్యపిల్లలతో రెండ్రోజుల క్రితం వెళ్లారు. వీరి పిల్లలు సిరి, ఖుషి తో పాటు అక్షయ (6).. గురువారం వరుసకు బాబాయ్ అయ్యే నరేందర్‌రెడ్డి చేతిలో దారుణహత్యకు గురయ్యారు. విషయం తెలియగానే ఇటు దూలపల్లిలో, అటు నిజామాబాద్ జిల్లాలోని స్వగ్రామం దూపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమకు టాటా.. బై బై చెప్పిన పిల్లలు మంటల్లో కాలిపోయారని తెలిసి దూలపల్లిలోని అపార్ట్‌మెంట్‌వాసులు నివ్వెరపోయారు.
యూనిసెంట్ స్కూల్లో విషాదఛాయలు
బంధువుల పెళ్లికని వెళ్లిన ఖుషి, సిరి.. దారుణంగా హతమయ్యారని తెలిసి కొంపల్లిలోని యూనిసెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ స్కూల్లో ఖుషి 1, సిరి 3వ తరగతి చదువుతున్నారు. చిన్నారుల హత్య ఘటన ఆందోళనకు గురిచేసిందని ప్రినిపాల్, ఉపాధ్యాయులు చెప్పారు. చదువులో ఇద్దరు పిల్లలు ముందుండేవారని గుర్తుచేసుకున్నారు.
తెగిన పేగుబంధం
రఘుపతిరెడ్డి ముగ్గురు కుమారుల్లో పెద్దవాడు గంగారెడ్డి, చిన్న కుమారుడు రాజరెడ్డి. వీరికి చెరో కూతురు మాత్రమే సంతానం. నడిపి కుమారుడు సాయరెడ్డికి కూతురు, కుమారుడు ఉన్నారు. పిల్లలు హలత్యకు గురికావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఒక్కో కూతురితోనే వారు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. ఆడపిల్లలనే వారసులుగా ఆశలు పెట్టుకున్న వారికి ఈ ఘటన అంతులేని మనోవేదన మిగిల్చింది. తోటి బంధువులు పెళ్లిళ్లు చేసుకుని సుఖపడుతూ, ఆర్థికంగా ఎదుగుతున్నారనే ఈర్ష్యతోనే నరేందర్‌రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతుల బంధువులు చెబుతున్నారు.
పిల్లల విషయం చెప్పలేదు
బుధవారం రాత్రి నరేందర్‌రెడ్డి డీఐజీకి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడని, దీంతో అప్రమత్తమయ్యామని
జిల్లా ఎస్పీ తరుణ్‌జోషీ తెలిపారు. అయితే ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నరేందర్‌రెడ్డి చెప్పలేదన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యుల ఫిర్యాదుతో జిల్లావ్యాప్తంగా పోలీసులతో పాటు, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చామన్నారు. అంతలో గురువారం ఉదయం ముగ్గురు పిల్లలు డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామ శివారులో మంటల్లో కాలి చనిపోయినట్లు తెలిసిందన్నారు.
మృతదేహాలు స్వగ్రామానికి తరలింపు
అతి దారుణంగా హతమైన ముగ్గురు పిలల్ల మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నరేందర్‌ను ప్రజల ముందే ఉరితీయాలని నినాదాలు చేశారు. పోస్టుమార్టమ్ అయ్యే వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మృతదేహాలను దహన సంస్కారాల కోసం రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి తరలించారు. పక్కపక్కనే చితులు పేర్చి.. ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులు ఒకేసారి తలకొరివి పెట్టడం చూసిన వారంతా కంటతడి పెట్టారు.