ది హిందూ 'నగేష్' అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు!
పాతబస్తీలో మతగురువు ముస్తాఫా ఇద్రూస్ బాబాను డీజీపీ దినేష్ రెడ్డి కలసిన అంశంపై కథానాన్ని ప్రచురించిన కేసులో ది హిందు రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శనివారం రంగం సిద్ధం చేశారు. అందులోభాగంఆ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నగేష్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. అదికాక నగేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పత్రాలు ఏవి తమకు అందలేదని పోలీసులు తెలిపారు.
కాగా హిందూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌కు హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పదివేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని నగేష్‌ను ఆదేశించింది. అంతేకాక నాలుగు వారాల పాటు ప్రతి శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారుల ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అలాగే పోలీసు దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో మత గురువు ముస్తాఫా ఇద్రూస్ బాబాను డీజీపీ దినేష్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన కలిసిన అంశాన్ని ప్రచురించినందుకు నమోదు చేసిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేయాలంటూ నగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ చంద్రకుమార్ విచారించారు.
పోలీసుల చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పోలీసుల చర్య ఏకపక్షంగా ఉందని ఆయన తెలిపారు. విధుల్లో భాగంగానే డీజీపీ వార్తను ప్రచురించామని, మరుసటి రోజు డీజీపీ పంపిన వివరణను సైతం ప్రముఖంగా ప్రచురించడం జరిగిందని, ఇందులో ఎటువంటి దురుద్దేశాలు లేవని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నగేష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.