మోడల్!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో మోడల్ స్కూళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ స్కూళ్లు సమస్యలకు ‘మోడల్’గా నిలుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యం కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించడంతో ఈ స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎగబడ్డారు. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు చేసుకున్నారు. లాటరీ పద్ధతిలో సీట్లను భర్తీ చేశారు. కొన్ని స్కూళ్లలో అరకొర ఖాళీలు ఉండడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు కేంద్ర మంత్రులు కూడా సిఫారసులు చేశారంటే వీటి పట్ల ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఏడాది కూడా తిరక్కుండానే ఈ స్కూళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం ఉపాధ్యాయుల కొరత. విద్యార్థులు ఫుల్‌గా ఉన్నా.. ఉపాధ్యాయులు మాత్రం తగినంత మంది లేరు. ఫలితంగా విద్యార్థులు ఒక్కొక్కరుగా టీసీలు తీసుకుని బయటకు వస్తున్నారు.
ఒక్కో మోడల్ స్కూల్లో 6-9 తరగతుల వరకు 320 మంది విద్యార్థులు ఉండాలి. ఈ లెక్కన జిల్లాలోని 25 పాఠశాలల్లోనూ 320 మంది చొప్పున విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అయితే.. ప్రస్తుతం అగళిలో 280 మంది, తాడిపత్రి 265, ధర్మవరం 289, ఆమడగూరులో 286 మంది మాత్రమే ఉన్నారు.
ఇక ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రతి కళాశాలలోనూ 80 మంది ఉండాలి. అయితే.. రామగిరిలో 11 మంది, అమడగూరు 11, గుత్తి 21, తాడిపత్రిలో 24 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వాటిలోనూ ఇదే పరిస్థితి.
మొదటి నుంచి ఇంతే...
వాస్తవానికి 2012-13 విద్యా సంవత్సరంలోనే మోడల్ స్కూళ్లు ప్రారంభిస్తామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే.. రాష్ట్రంలో ఎక్కడా ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు 2013-14 విద్యా సంవత్సరంలో తొలివిడతగా జిల్లాలో 25 పాఠశాలలను ప్రారంభించారు. అమ్మాయిలకు రెసిడెన్షియల్ వసతి ఉంటుందని ప్రకటించారు. ఏ ఒక్క పాఠశాలలోనూ వసతి కల్పించడం లేదు. ఇప్పటికీ జిల్లాలో ప్రారంభమైన 25 మోడల్ స్కూళ్లలో ఏ ఒక్క భవనమూ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ప్రతి భవనంలోనూ పనులు పెండింగు ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
ప్రవేశాలు సరే.. తరగతులేవీ?
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు జరిగాయి కానీ తరగతులు మాత్రం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయుల కొరతే కారణం. 25స్కూళ్లకు గాను 25 మంది ప్రిన్సిపాళ్లు ఉండాల్సివుండగా.. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక టీజీటీ పోస్టులు 81 ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే.. తెలుగు 13, ఇంగ్లిష్ 14, గణితం 13, హిందీ 17, సైన్స్ 10, సోషియల్ 14 ఖాళీలు ఉన్నాయి. పీజీటీలకు సంబంధించి 83 ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా.. ఇంగ్లిష్ 11, గణితం 7, ఫిజికల్ ైసైన్సు 10, కెమిస్ట్రీ 10, బాటనీ 10, జువాలజీ 10, ఎకనామిక్స్ 7, సివిక్స్ 7, కామర్స్ 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నాన్‌టీచింగ్ స్టాఫ్ ఎప్పుడొస్తారనే విషయం అధికారులకే తెలియడం లేదు. ఉపాధ్యాయులు లేకపోవడంతో చాలా స్కూళ్లలో అన్ని తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థులు కావలెను!
జిల్లాలోని 25 మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం సీట్లు భర్తీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి 28 లోపు ఆయా స్కూళ్లలో విద్యార్థులు నేరుగా చేరాలని సూచించారు.
నేడు ప్రిన్సిపాళ్లతో మంత్రి సమావేశం
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శనివారం అనంతపురంలో సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలలు, మోడల్ స్కూళ్ల సమస్యలు, అడ్మిషన్లు, మౌలిక వసతులు తదితర వాటిపై చర్చించనున్నట్లు తెలిసింది.