రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
సాహా డబుల్ సెంచరీ
పుజారా అజేయ శతకం
ముంబై: రెస్టాఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్‌ను నిలబెట్టుకుంది. మంగళవారం ఇక్కడ ముగిసిన ఐదు రోజుల మ్యాచ్‌లో రెస్ట్ జట్టు ఆరు వికెట్ల తేడాతో రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. వృద్ధిమాన్ సాహా (272 బంతుల్లో 203 నాటౌట్; 26 ఫోర్లు, 6 సిక్సర్లు) డబుల్ సెంచరీ, చతేశ్వర్ పుజారా (238 బంతుల్లో 116; 16 ఫోర్లు) సెంచరీ సహాయంతో రెస్టాఫ్ ఇండియా 4 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 266/4తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. చివరి రోజు రెస్ట్ జట్టు 19.1 ఓవర్లలో 113 పరుగులు సాధించగా, సాహా, పుజారా ఐదో వికెట్‌కు అభేద్యంగా 316 పరుగులు జోడించారు. ఇరానీ కప్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ఈ ట్రోఫీని రంజీ విజేత 27 సార్లు గెలవగా, ఇప్పుడు రెస్టాఫ్ ఇండియా కూడా 27 టైటిల్స్‌తో దానిని సమం చేసింది.
చివరి రోజు ఛేదనలో సాహా, పుజారాలకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. అనుభవం లేని గుజరాత్ బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు అలవోకగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో ముందుగా పుజారా 215 బంతుల్లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 37వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాహా, 270 బంతుల్లో కెరీర్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఇరానీ కప్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ పొరపాట్లపై గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ మరోసారి బహిరంగంగా తన అసంతృప్తిని ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాట్‌కు బంతి తగలకుండానే అవుట్ ఇచ్చాడంటూ ‘మీరు అసలు అంపైరింగ్ ఎందుకు చేస్తారు’ అని నేరుగా అంపైర్ మొహంపైనే ప్రశ్నించడం వివాదం రేపింది.