కొత్త ఆలోచనలకు రెడ్‌కార్పెట్
వైద్యం, విజ్ఞానం కలిస్తే అద్భుతం మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో: కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ఇంజనీరింగ్ ది ఐ వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మేమంటే మేమే తయారు చేశామని కొంత మంది రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారని, నిజానికి ఇది ఏ ఒక్కరి కృషితోనో సాధ్యం కాలేదన్నారు.
వైద్య రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం వల్ల అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇంజినీర్లకు, ఐటీ సాంకేతిక, వైద్య నిపుణులకు, డిజైనర్లకు ఇదో చక్కటి అవకాశమని సూచించారు. నేత్ర వైద్య చికిత్సలో ఎల్వీప్రసాద్ వైద్య నిపుణులు చూపుతున్న చొరవ, అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్‌రావు మాట్లాడుతూ నేత్ర సంరక్షణ కోసం ఆధునిక వైద్య సేవలను ఆవిష్కరించేలా వర్క్‌షాప్ దోహదపడుతుందన్నారు.ఎంఐటీ మీడియా ల్యాబ్స్ కెమెరా కల్చర్ గ్రూప్ ప్రాజెక్ట్ ఇన్నొవేటర్ జాన్వెర్నర్, సెయెంట్ ఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి, పాల్గొన్నారు.